వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం
- IndiaGlitz, [Tuesday,July 21 2020]
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఎప్పటి నుంచో తమ తండ్రి ఆరోగ్యం రీత్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన కూతుళ్లు న్యాయస్థానానికి మొర పెట్టుకుంటూనే ఉన్నారు. ఆయనకు ఇటీవలే కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను చికిత్స నిమిత్తం తొలుత జేజే అక్కడి నుంచి సెయింట్ జార్జ్, ప్రస్తుతం నానావతి ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందే ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా కూడా తోడవడంతో ఆరోగ్యం మరింత విషమించినట్టు తెలుస్తోంది. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితిని న్యాయవాది సుదీప్ పస్‌బోలా బోంబే హైకోర్టుకు విన్నవించారు.
వరవరరావు ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని.. మరికొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశం ఉందని సుదీప్ కోర్టుకు వివరించారు. కనీసం ఆయన మరణం అయినా ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగేలా చూడాలని కోర్టును కోరారు. విచారణను ఏ విధంగానూ ప్రభావితం చేసే స్థితిలో వరవరావు లేరని.. కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం వరవరావు తనకు తానుగా ఏ పనీ చేయలేకపోతున్నారని.. ఆయనకు కుటుంబ సభ్యుల్లో ఒకరిని తోడుగా ఉండేలా చూడాలని కోరారు. ఆరోగ్య పరిస్థితిని అధికారికంగా ఎప్పటికప్పుడు తెలియజేసేలా ఆసుపత్రి సిబ్బందిని, జైలు అధికారులను ఆదేశించాలని న్యాయవాది సుదీప్ కోర్టును కోరారు.
కాగా ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా రోగుల్ని కలిసేందుకు కుదరదని కోర్టుకు ఎన్‌ఐఏ తరపున న్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వివరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దీపక్ థాకరే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుటుంబ సభ్యులు వరవరరావును కలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కాగా.. నిర్దిష్ట దూరం నుంచైనా ఆయనను కుటుంబ సభ్యులు చూసేందుకు వీలవుతుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. బుధవారంలోగా తమకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.