హైదరాబాద్ ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం
- IndiaGlitz, [Saturday,March 20 2021]
నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓటుతో ఆమె ఈ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుపై మొదటి నుంచి వాణీదేవి ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. చివరకు వాణీదేవి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభమైంది. నాలుగు రోజుల సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగిన అనంతరం ఫలితం వాణీదేవికి అనుకూలంగా వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థిని వాణీదేవికి 1,28,010 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి.
తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ విజయం దక్కలేదు. దీంతో మొత్తం 91 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ చేశారు. తొలి ప్రాధాన్యతగా వాణీదేవికి 1,12,689 ఓట్లు రాగా.. 36,580 రెండో ప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా ఆమెకు 1,49,249 ఓట్లు వచ్చాయి. వాణీదేవి విజయం సాధించాలంటే 19,251 ఓట్లు రావాల్సి ఉంది. అలాగే ఎవరికీ కోటాకు అవసరమైన ఓట్లు రాకపోవడంతో బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించినట్టు సమాచారం. ఆయన ఓట్లలో రెండో ప్రాధాన్యతగా వచ్చిన ఓట్లను ఆమె ఖాతాలో వేయనున్నారు. వాణీదేవి విజయాన్ని మరికాసేపట్లో అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.