వైఎస్ జగన్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకో : రాధా
- IndiaGlitz, [Thursday,January 24 2019]
వైసీపీని వీడిన విజయవాడ కీలకనేత వంగవీటి రాధా.. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. రాజీనామా, టీడీపీ నేతల భేటీ అనంతరం ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చిన రాధా.. ఇప్పటికైనా వైఎస్ జగన్ తన పద్ధతి మార్చుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీలో ఉంటే మా తండ్రి ఆశయం నెరవేరదని అందుకే తాను రాజీనామా చేసి బయటికొచ్చానన్నారు. పార్టీలో చేరేటప్పుడు తన తండ్రి ఆశయం గురించి జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
రాధా మాటల్లోనే. వైసీపీలో నాకు జరిగిన అవమానాలు ఎవరికీ జరగకూడదు. తమ్ముడిలాంటి వాడివంటూనే నన్ను అవమానించారు. నా తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లడం కూడా పొరపాటేనా..?. నేనెందుకు మీ పర్మిషన్ తీసుకోవాలి.? ఎవరి అనుమతి తీసుకొని వెళ్లావంటూ నన్ను నిలదీశారు. నా తండ్రి అభిమానులను సంతృప్తి పరచడం తప్పా..?. తండ్రి లేని వాడివనే ఇన్నాళ్లు పార్టీలో ఉండనిచ్చామని అంటున్నారు. పార్టీలో చేరేటప్పుడు జగన్ సొంత తమ్ముడికంటే ఎక్కువన్నారు. తండ్రి ఆశయాల కోసం ఎన్నో అవమానాలను వైసీపీలో భరించాను. నా తండ్రిని అన్ని పార్టీల వారు అభిమానిస్తారు. ఇకనైనా జగన్ తన పద్ధతి మార్చుకోవాలి. వంగవీటి రంగా అభిమానులను జగన్ గౌరవించాలి. ఎవరైనా నా కిందే అన్నట్లు జగన్ వ్యవహరించారు అని రాధా చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పటికే వంగవీటి రాధాపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. కాగా తాజా ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్‌పై సంచలన కామెంట్స్ చేయడమే కాకుండే ఒకింత హెచ్చరికలు కూడా చేశారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.