Vande Sadharan Express:‘వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్’ ట్రయల్ రైన్ సక్సెస్.. త్వరలోనే ప్రయాణికులకు అంబాటులోకి..
- IndiaGlitz, [Wednesday,November 08 2023]
భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం పడబోతుంది. సాధారణ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ తీసుకొస్తు్న్న ‘వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్’ (Vande Sadharan express) ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ముంబయి నుంచి బయలుదేరిన ఈ రైలు విజయంవతంగా అహ్మదాబాద్ చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే దేశంలో ఏసీ బోగీలతో కూడిన వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. వాటి తరహాలోనే నాన్ ఏసీ బోగీలతో ‘వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్’లను రూపొందించారు. మొత్తం 22 కోచ్‌లతో కూడిన ఈ రైళ్లలో స్లీపర్, జనరల్ క్లాసులు ఉంటాయి.
ఇందులో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సీసీటీవీ కెమెరాలు అమర్చారు. అలాగే ప్రమాదాల గురించి ముందుగానే అప్రమత్తం చేసేందుకు భద్రతా సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఈ రైళ్లకు రెండు చివరల ఇంజిన్లు అమర్చారు. సుమారు 1800 మంది ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యవంతంగా ప్రయాణం చేయొచ్చు. గరిష్ఠంగా 130 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే అవకాశం ఉండటంతో 500 కిలోమీటర్లకు పైగా ఉండే మార్గాల్లో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. దేశంలోని పలు ప్రముఖ నగరాల గుండా ఈ వందే సాధారణ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి.
తొలి దశలో ముంబయి-న్యూఢిల్లీ, పట్నా-న్యూఢిల్లీ, హావ్ డా-న్యూఢిల్లీ, హైదరాబాద్-న్యూఢిల్లీ, ఎర్నాకులం-గువాహటి మార్గాల్లో ఈ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రూట్లలో వచ్చే ప్రయాణికుల స్పందనను బట్టి దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను పెంచేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. తక్కువ ఛార్జీలతో, గమ్యా్న్ని త్వరగా సౌకర్యవంతమైన ప్రయాణంలో చేరుకోవాలనే లక్ష్యంతో ‘వందే సాధారణ్’ రైళ్లు రూపుదిద్దుకున్నాయి. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా వాడుకలోకి వస్తే మెట్రో నగరాల్లో ఉపాధి పొందే వారికి చాలా ప్రయోజనం చేకూరనుంది.