Vande Bharat :వందేభారత్ స్లీపర్ కోచ్‌ల డిజైన్లు విడుదల.. 2024 మొదట్లో అందుబాటులోకి..

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు పట్టాలపై తిరుగుతున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఫుల్ డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచుతుంది. అలాగే స్లీపర్ కోచ్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. 2024 ప్రథమార్థంలో ఈ వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని చెబుతూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విజువల్స్‌తో పాటు ఫొటోలను విడుదల చేశారు.

857 బెర్తుల్లో 823 బెర్తులు ప్రయాణికులకు.. 34 బెర్తులు సిబ్బందికి..

ప్రస్తుతం ఈ స్లీపర్ రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మాణంలో ఉన్నాయి. మొత్తం ఇందులో 857 బెర్తులు ఉండబోతోన్నాయి. అయితే 823 బెర్తులు మాత్రమే ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవచ్చు. మిగిలిన 34 బెర్తులు రైల్వే సిబ్బందికి కేటాయించారు. ఒక్కో కోచ్‌లో నాలుగుకు బదులుగా మూడు టాయ్‌లెట్లుతో పాటు ఓ మినీ ప్యాంట్రీ ఉంటుంది. దివ్యాంగుల కోసం అనువుగా ఉండేలా ర్యాంప్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ కోచ్‌లలో బెర్తులు మరింత వెడల్పుగా ఉండనన్నాయి. దీంతో ప్రయాణికులు సులభంగా పై బెర్తుకు చేరుకునేందుకు వీలుగా వీటిని డిజైన్ చేశారు.

వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఫుల్ డిమాండ్..

ఈ ఏడాది మొదట్లో వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే సాధారణ రైళ్ల కంటే ఈ రైళ్లలో ప్రత్యేక సదుపాయాలు ఉండటంతో డిమాండ్ పెరుగుతోంది. 100శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇక పండుగ సీజన్లలో అయితే టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సామాన్యులకు మాత్రం ఈ టికెట్లు రేట్లు భారంగానే ఉన్నాయి. అయినా కానీ త్వరగా తమ గమ్యస్థానాలకు చేరడానికి ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ కోచ్‌లు మాత్రమే ఉండగా.. త్వరలోనే స్లీపర్ కోచ్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఈ రైళ్లకు మరింత డిమాండ్ ఏర్పడనుంది.