‘వకీల్‌సాబ్’ టీజర్: దుమ్ము రేపిన పవన్

  • IndiaGlitz, [Thursday,January 14 2021]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ ప్రధాన పాత్ర‌లో తెరకెక్కిన చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సంక్రాంతి పండుగ కానుకగా నేడు విడుదలైంది. పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో పవన్ అదరగొట్టేశారు. మూడేళ్లుగా రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమైన పవన్.. తిరిగి ‘వకీల్‌సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా టీజర్‌ను బట్టి తెలుస్తోంది. పవన్ నల్లకోటు వేసుకుంటుండగా టీజర్ ప్రారంభమవుతుంది. లా పుస్త‌కాల‌పై ఉన్న కవర్‌ను తీసేసి.. కోర్టులో కేసును వాదించేందుకు సిద్ధమవడం వంటి అంశాలు ఆకట్టుకున్నాయి.

కోర్టులో సీరియ‌స్‌గా ‘అబ్జ‌క్ష‌న్ యువ‌రాన‌ర్’ అంటూ డైలాగ్ చెప్ప‌డం.. అలాగే త‌నని క‌త్తితో పొడ‌వ‌డానికి వ‌చ్చిన విల‌న్స్‌‌ను చితకబాదుతూ.. ‘కోర్టులో వాదించ‌డమూ తెలుసు... కోటు తీసి కొట్ట‌డ‌మూ తెలుసు’ అంటూ చెప్పే డైలాగ్స్ పవన్ హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్ చేసినట్టు స్పష్టం చేస్తున్నాయి. చివ‌ర‌లో త‌న ల‌గేజీతో పవన్ ట్రావెల్ చేసే సీన్‌తో టీజర్‌కు కంక్లూజన్ ఇచ్చారు. అలాగే బ్యాగ్రౌండ్ లో స‌త్య‌మే జ‌య‌తే.. అనే ప‌దానికి సంబంధించిన మ్యూజిక్ వినిపిస్తుండటం కూడా చాలా అద్భుతంగా అనిపించింది. త‌మ‌న్ త‌న‌దైన స్టైల్లో సూప‌ర్బ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజ‌ర్‌లోని ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎలివేట్ చేశారనడంలో సందేహం లేదు. పక్కా క్లాస్, మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా టీజర్‌ను కట్ చేశారు.

ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ అభిమానులు ‘వకీల్‌సాబ్’ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్‌తో అంచనాలను చిత్ర యూనిట్ మరింత పెంచేసింది. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి తమన్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మొత్తానికి టీజర్‌తో ‘వకీల్‌సాబ్’ దుమ్ము రేపేశాడు. ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.