Download App

Vakeel Saab Review

పవన్ కళ్యాణ్ 'పింక్' రీమేక్ చేయడం ఏమిటి? అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ పవర్ స్టార్ కి సూట్ అవుతుందా? 'వకీల్ సాబ్' సినిమా అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకులలో ఎన్నో సందేహాలు. సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదలయ్యాక 'పింక్'లో అన్ని పాటలకు, ఫైట్లకు స్కోప్ ఉందా? తెలుగులో 'పింక్' కథలో ఎన్ని మార్పులు చేశారో? ఒరిజినల్ కథను చెడగొట్టారా? ఇటువంటి కామెంట్లు వినిపించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని, హీరో స్టార్ డమ్, ఇమేజ్ కి తగ్గట్టు అభిమానులు కోరుకునే అంశాలకు సినిమాలో చోటు కల్పించామని దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఆ మార్పులేమిటి? మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఎలా ఉంది? రియల్ చూద్దాం.

కథ:

పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి), దివ్య (అనన్యా నాగళ్ల) వర్కింగ్ విమెన్. ముగ్గురు ఫ్రెండ్స్. ఫ్లాట్ తీసుకుని రెంట్ కి ఉంటున్నారు. ఒకరోజు క్యాబ్ లో ఫ్లాట్ కి వెళ్తుండగా బ్రేక్ డౌన్ అయిందని రోడ్డు పక్కన డ్రైవర్ పార్క్ చేస్తాడు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో మరో క్యాబ్ బుక్ చేసుకుందామని పల్లవి ప్రయత్నిస్తుంది. కాని అందుబాటులో క్యాబ్స్ ఉండవు. అదే సమయంలో పల్లవి క్లాస్‌మేట్, అతడి స్నేహితుడైన ఎంపి కొడుకు, ఇంకొకరు కారులో వెళుతూ... ముగ్గురు అమ్మాయిలను చూసి ఆగుతారు. లిఫ్ట్ ఇస్తారు. అక్కడి నుండి రిసార్టుకు వెళతారు. కాసేపటికి కంటికి బలమైన గాయం కావడంతో ఎంపి కొడుకును అతడి స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళతారు. ఆ రోజు గొడవకు కారణం ఏంటి? ఎంపి కొడుకును పల్లవి ఎందుకు కొట్టింది? రాజకీయ పలుకుబడితో పల్లవిపై కేసు పెట్టడంతో పాటు ముగ్గురు అమ్మాయిలను బజారు మనుషులుగా చిత్రీకరించాలని ఎంపి కొడుకు, అతడి బృందం చేసిన ప్రయత్నాలను లాయర్ సత్యదేవ్ (పవన్ కల్యాణ్) ఎలా అడ్డుకున్నాడు? పేదల పక్షాన నిలబడి న్యాయం కోసం కేసులు వాదించే 'వకీల్ సాబ్'గా ముద్రపడిన సత్యదేవ్ నాలుగేళ్లు బార్ కౌన్సిల్ నుండి ఎందుకు సస్పెండ్ అయ్యాడు? మళ్లీ పల్లవి కేసు ఎందుకు టేకప్ చేశాడు? అన్నదే సినిమా.

విశ్లేషణ:

బాలీవుడ్ సినిమా 'పింక్' చూసిన ప్రేక్షకులకు పైన చెప్పిన కథ కొత్తగా అనిపించదు. కాని సినిమా చూస్తే హీరో క్యారెక్టరైజేషన్ ఎంత మార్చిందీ తెలుస్తుంది. కథలో ఆత్మను ఏమాత్రం మిస్ చేయకుండా హీరో పాత్రను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసిన దర్శకుడు శ్రీరామ్ వేణును అభినందించాలి. పవన్ రాజకీయ జీవితాన్ని గుర్తుచేసే విధంగా కొన్ని సన్నివేశాల్లో డైలాగులను మిళితం చేశారు. యాక్షన్ సీన్స్ అయితే సూపర్బ్. 'పింక్' సినిమా చూడని ప్రేక్షకులకు 'వకీల్ సాబ్' ఫుల్ మీల్స్. యాక్షన్, ఎమోషన్, అన్నిటికి మించి మెసేజ్, ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ లు మెస్మరైజ్ చేస్తారు.

ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఇంత అగ్రెస్సివ్, ఎమోషనల్ పెర్ఫార్మన్స్ చేయలేదు. మూడేళ్ళ విరామం తర్వాత చేసిన సినిమా కావడంతో సిల్వర్ స్క్రీన్ మీద కొత్త పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. సినిమా నిదానంగా ప్రారంభమవుతుంది. మధ్య మధ్యలో పవన్ క్యారెక్టర్ స్క్రీన్ మీద తళుక్కున కనిపించి వెళుతూ ఉండటం తప్ప అసలు కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యింది తక్కువ. ఫ్లాష్ బ్యాక్ నుండి పవన్ పూర్తిస్థాయిలో తెరపైకి వస్తాడు. తమిళంలో అజిత్ చేసిన 'పింక్' రీమేక్ తో పోలిస్తే... తెలుగు వెర్షన్ ఫ్లాష్‌బ్యాక్‌లో చాలా మార్పులు చేశారు. లెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. పవన్ ను పేదల పాలిట దేవుడిలా నిలబడినఆ వకీల్ సాబ్ గా చూపించే సన్నివేశాలు అభిమానులకు నచ్చుతాయి. అయితే, స్టూడెంట్ గా పవన్ అంతగా సెట్ కాలేదని అనిపిస్తుంది. అదొక్కటీ సినిమాకి మైనస్. సెకండాఫ్ లో కోర్టు రూమ్ సన్నివేశాల్లో జీవించాడు. కథగా సినిమాను చూసినా... ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ప్రేక్షకుల్ని ఎక్కువ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో ఎమోషన్, డ్రామా అందర్నీ కట్టిపడేస్తాయి.

తమన్ మ్యూజిక్ సినిమాకి మెయిన్ పిల్లర్ అనడంలో సందేహం అక్కర్లేదు. సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి. రీరికార్డింగ్ అంతకు మించి చేశాడు. ఫైట్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్. ట్రైన్ ఫైట్ ఎండింగ్ లో రీరికార్డింగ్ కి అభిమానులకు గూస్ బంప్స్ గ్యారెంటీ. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఫైట్స్ డిజైనింగ్ బాగుంది.

సినిమాలో డైలాగుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 'నువ్వు ఎవరి కోసం నిలబడ్డావో వాళ్లే నిన్ను మధ్యలో వదిలేశారు' అంటూ ముఖేష్ రుషి చెప్పిన డైలాగ్ పవన్ రాజకీయ ప్రయాణం గురించి పరోక్షంగా ప్రస్తావించినట్టు అయ్యింది. పవన్ కౌంటర్ డైలాగ్ థియేటర్లలో వినండి. మరో సన్నివేశంలో 'ఆశతో ఉన్నోడికి గెలుపు, ఓటమి ఉంటాయి. ఆశయంతో ఉన్నోడికి ప్రయాణం మాత్రమే ఉంటుంది' అని పవన్ చెప్పిన డైలాగ్ఆ, రాజకీయాలపై అతడి వైఖరిని స్పష్టం చేసింది. ఇక, 'జనానికి నువ్వు కావాలి' అని పవన్ తో శరత్ బాబు చెప్పిన డైలాగ్ అభిమానుల ఆకాంక్షను ప్రతిబింబించింది.  

నటీనటులు ఎలా చేశారు?:

కోర్టు రూమ్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ విజృంభించాడు. మహిళల గురించి మాట్లాడిన ప్రతి మాట ప్రేక్షకుల మనసుకు సూటిగా తగులుతుంది. పవన్, ప్రకాష్ రాజ్ మధ్య ఢీ అంటే ఢీ అనే సన్నివేశాలు ఉన్నాయి. వాటిలో ఇద్దరూ పోటాపోటీగా నటించారు. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ వల్ల పవన్ మరింత ఎలివేట్ అయ్యాడు. లాయర్ గా కాకుండా మరో రెండు లుక్స్ లో పవన్ కనిపించాడు. గడ్డంతో లుక్ బాగుంది. పవన్ కి జంటగా ఫ్లాష్‌బ్యాక్‌లో శృతి హాసన్ కనిపించారు. ఆమె సన్నబడినట్టు తెలుస్తుంటుంది. ముఖం పీక్కుపోయినట్టు ఉన్నారు. మూడు ప్రధాన పాత్రలకు నివేదా థామస్, అంజలి, అనన్యా నాగళ్ల ప్రాణం పోశారు. ఎమోషనల్ సీన్స్ లో వాళ్ల నటన గుండె లోతుల్లో తడిని టచ్ చేస్తుంది. 

ఫైనల్ పంచ్:

నటుడిగా పవన్ కళ్యాణ్ ను కొత్తగా ఆవిష్కరించిన సినిమా 'వకీల్ సాబ్'. ఇప్పటివరకు ఆయన చేసినటువంటి పాటలు లేవు. 'కంటిపాప' ఒక్కటే ఉంది. ఆయన పక్కన హీరోయిన్ కాసేపే కనిపిస్తుంది. కామెడీ లేదు. కాని కోర్టు రూమ్ సన్నివేశాల్లో పవన్ నటన కట్టిపడేస్తుంది. హిందీ సినిమాలో సందేశాన్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా, మహిళ ఇష్టానికి విరుద్ధంగా ఎవరూ బలాత్కారం చేకూడదనే పాయింట్ ను బలంగా చెబుతూ... పవన్ నుండి అభిమానులు ఆశించే ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగులు ఉన్న సినిమా ఇది. హ్యాపీగా చూడవచ్చు.

Read 'Vakeel Saab' Movie Review in English

Rating : 3.3 / 5.0