గోవింద నామాలు అజేయం విజేయం అని అంటారు. ఆ గోవింద నామాల్లో ఒకటైన `వజ్రకవచధర గోవింద`ను టైటిల్‌గా పెట్టుకున్నారు సప్తగిరి. ఆయన హీరోగా చేసిన హ్యాట్రిక్ సినిమా `వజ్ర కవచధర గోవింద`. ఈ చిత్రంలో ఓ వజ్రానికి, గోవిందు అనే దొంగకి, కొంతమంది కేన్సర్ పేషంట్లకూ సంబంధించిన అంశాలుంటాయి. సినిమా ఆద్యంతం కామెడీతో నవ్వించినా మెసేజ్ కూడా ఉంటుందని సప్తగిరి ఇదివరకే చెప్పారు. ఆయన నమ్మి చేసిన ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకుంది.. లెట్స్ వాచ్.
కథ:
రాయలసీమలోని సోమల గ్రామానికి చెందిన యువకుడు గోవిందు(సప్తగిరి). తక్కువ కుటుంబాలున్న ఆ గ్రామంలో నీళ్లు సరిగా ఉండవు. నల్గొండలో ఫ్లోరైడ్, ఉద్ధానంలో కిడ్నీ సమస్యలాగా, ఈ ఊళ్లో కేన్సర్ సమస్య ఉంటుంది. ఖరీదైన వైద్యం ఇప్పించలేక తమ వాళ్లు కంటి ముందు రాలిపోవడాన్ని చూస్తూ ఉంటారు గ్రామస్థులు. అలాంటి వారికి తన చిన్ననాటి స్నేహితురాలు ఎమ్మెల్యేగా గెలిచి సాయం చేస్తుందని నమ్మకంగా చెబుతాడు గోవింద్. నల్లూరి లక్ష్మీ ప్రసన్న (అర్చన) అనే ఎమ్మెల్యే గోవిందును తన అవసరం తీరాక కరివేపాకును తీసేసినట్టు తీసేస్తుంది. ఆమె చేసిన పరాభవానికి మనసులోనే కుమిలిపోతాడు గోవిందు. దానికి తోడు తానేదో చేస్తాడని నమ్మిన కిట్టు ప్రాణాలు కోల్పోయేసరికి ఆ బాధ మరింత పెరుగుతుంది. దాంతో ఊళ్లో నుంచి బయటికి పోయి దొంగతనాలు చేస్తాడు. ఆ క్రమంలో అతను పరశురామక్షేత్రానికి వెళ్తాడు. అక్కడ అతనికి మహేంద్రనీలం అనే పేరున్న వజ్రం దొరుకుతుంది. అయితే ఓ రోజు ఫ్రెండ్స్ తో కలిసి తాగుతూ ఆ నీలాన్ని దాచిపెడతాడు. ఆ క్రమంలో జరిగిన ప్రమాదంలో అతనికి గతం గుర్తుకురాదు. దాని పర్యవసానం ఏంటి? పరశురామక్షేత్రానికి చెందిన బసవప్ప కు ఆ వజ్రం గురించి ఎలా తెలిసింది? దాని కోసం అతను గోవిందును ఏం చేశాడు. వజ్రాన్ని కాపాడటంలో గోవిందుకు పాము చేసిన సాయం ఏంటి? కుక్కకు తెలిసిన రహస్యం ఏంటి? ఎమ్మెల్యే చివరకు మారిందా? లేదా? వంటివన్నీ తెలియాలంటే `వజ్ర కవచధర గోవింద` చూడాల్సిందే.
ప్లస్ పాయింట్లు:
- సప్తగిరి నటన
- డైలాగులు
- హిప్నాటిజమ్ సీన్
మైనస్ పాయింట్లు:
- స్క్రీన్‌ప్లే
- సన్నివేశాల్లో బలం లేకపోవడం
- కొత్తదనం కరవవ్వడం
సప్తగిరి సినిమా అనగానే అదేదో కమెడియన్ కోసం తీసిన సినిమాలాగా అనిపించదు. రెగ్యులర్ సాంగ్స్, ఫైట్స్ ఉంటాయి. కథలోనూ ఏదో ఒక కాజ్ ఉంటుంది. ఈ సినిమాలోనూ అవన్నీ ఉన్నాయి. పాటలు, ఫైట్లతో పాటు కేన్సర్ పేషంట్ల కోసం పాటుపడే ఓ మంచి హృదయం ఉంటుంది. అయితే దానికి అతను ఎంపిక చేసుకున్న మార్గమే దొంగతనం. ఆ దొంగతనం దేవుడికి కూడా నచ్చకుండా సర్పం రూపంలో దాన్ని కాచుకుంటుంటాడు. కానీ అతని ఉద్దేశం తెలుసుకున్న తర్వాత దైవానుగ్రహం కలుగుతుంది. ఈ సినిమాలో డైలాగులు బావున్నాయి. సప్తగిరి స్వామీజీ వేషంలో చేసే అల్లరి నవ్వులు తెప్పిస్తుంది. అలాగే సెకండాఫ్‌లోనూ నవ్వులు తెప్పించే సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో అర్చన శాస్త్రి నటిస్తున్నట్టు ముందు ఎక్కడా పొక్కనివ్వలేదు. ఎమ్మెల్యే పాత్రలో అర్చన మెప్పిస్తుంది. ఆమె పాత్ర కూడా సినిమాకు కీలకమే. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడనే కాన్సెప్ట్ ను ఇందులో వాడారు. రాయలసీమ నేటివిటీని చక్కగా చూపించారు. చిత్తూరు జిల్లాలోని మునీశ్వరుడు చెట్టు, పలమనేరు, పీలేరు వంటి ప్రాంతాల పేర్లు, అక్కడికి సంబంధించిన కొన్ని అంశాలు స్థానికులనుబాగానే ఆకట్టుకునే అంశాలు. సినిమా కొన్ని చోట్ల మరీ బోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది. పిచ్చోళ్ల సన్నివేశం అక్కడక్కడా నవ్వించినా కాస్త చిరాకు తెప్పిస్తుంది. హిప్పాటిజమ్ సన్నివేశం మాత్రం సినిమాకు హైలైట్ అవుతుంది. సరదాగా నవ్వుకోవాలనుకునేవారు ఈ సినిమాకు వెళ్లొచ్చు. సప్తగిరి పండించిన కామెడీ కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే సినిమాకు పైసలు వచ్చినట్టే.
వజ్రకవచధర గోవింద.. ఓ మంచి పాయింట్ ఇంకా బాగా డీల్ చేసుండొచ్చు. టేకింగ్‌లో మిస్ ఫైర్.
Comments