2 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ త్వరలోనే.. తప్పనిసరి అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్
- IndiaGlitz, [Thursday,June 24 2021]
కరోనాని అరికట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. అందుకే దేశం మొత్తం కరోనా వ్యాక్సిన్ పంపిణి వేగంగా జరుగుతోంది. పలు సంస్థలు తయారు చేస్తున్న టీకాలు దేశవ్యాప్తంగా పంపిణీ జరుగుతున్నాయి. ప్రస్తుతం 18 ఏళ్ళు వయసు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందిస్తున్నారు
ఇదిలా ఉండగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం అవుతోంది పిల్లలే. ఈ నేపథ్యంలో 2 ఏళ్ళు పైబడిన పిల్లలకు టీకా ఎప్పుడు వస్తుంది అనే ఆసక్తి నెలకొంది. దీనితో తాజాగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక ప్రకటన చేశారు. చిన్న పిల్లల్లో కరోనా లక్షణాలు తక్కువగానే కనిపిస్తాయి. కానీ వారి వల్ల వైరల్ వ్యాప్తి చెందుతోంది.
అందువల్ల కరోనాని అరికట్టాలంటే పిల్లలకు కూడా టీకా తప్పనిసరి. ప్రస్తుతం రెండేళ్లు పైబడిన చిన్నారులకు టీకా క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. భారత్ బయోటెక్ తో పాటు మరికొన్ని సంస్థలు చిన్నారులకు టీకా తయారు చేస్తున్నాయి. చిన్నారుల టీకాపై రెండు, మూడోదశల ప్రయోగాల వివరాలు సెప్టెంబర్ లో వస్తాయి.
ఆ తర్వాత అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో చిన్నారులకు టీకా అందుబాటులోకి వస్తుంది అని గులేరియా అన్నారు. భారత్ బయోటెక్ సంస్థ చిన్నారుల టీకాలో కాస్త ముందంజలో ఉంది. ఇప్పటికే 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం 6 నుంచి 12 ఏళ్ళు గల వారికి ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఆ తర్వాతే రెండేళ్ల పైబడిన వారికి ట్రయల్స్ నిర్వహిస్తారు.