వీ1.. వీ 786!

  • IndiaGlitz, [Saturday,November 03 2018]

వీ ఏంటీ 1 ఏంటి? మ‌ళ్లీ వీ ఏంటి? 786 ఏంటి? అస‌లు ఆ హెడ్డింగ్ ఏంటి? ఏం చెప్పాల‌నుకున్నారు? అనేగా మీ అనుమానాలు.. అక్క‌డికే వ‌స్తున్నాం. ఇక్క‌డ వీ1 అంటే వెంక‌టేశ్ కూలీ నెంబ‌ర్ 1 అని అర్థం. మ‌రో వీ 786 అంటే వ‌రుణ్‌తేజ్ 786 అని అర్థం వీరిద్ద‌రూ క‌లిసి 'ఎఫ్‌2' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తోడ‌ళ్లుళ్లుగా వీళ్లిద్ద‌రూ క‌లిసి ఫ‌న్‌నీ, ఫ్ర‌స్ట్రేష‌న్‌నీ క‌లిసే పంచుకోనున్నారు. ప‌నిలో ప‌నిగా మ‌న‌కు కూడా పంచ‌నున్నారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కానుంది.

తిన‌బోయే ముందు రుచి చూపించిన‌ట్టు.. అనిల్ రావిపూడి ఈ సినిమాలోని ఓ ఫొటోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. రెండు చేతులు.. ఆ చేతుల‌కు క‌ట్టిన రెండు నెంబ‌ర్లు.. వాటిని చూడ‌గానే వెంక‌టేశ్ కూలీ నెంబ‌ర్ 1అని, త‌న పెద‌నాన్న వార‌సత్వాన్ని తీసుకుని వ‌రుణ్‌తేజ్ కూలీ నెంబ‌ర్ 786గా మారిపోయార‌నీ అర్థం చేసుకోవ‌చ్చు. పెళ్ల‌యిన మ‌గ‌వాళ్లు రైల్వే స్టేష‌న్ల‌లో విప‌రీతంగా బ్యాగేజ్‌ను మోయ‌డం చాలా సార్లు చూసే ఉంటాం. మ‌రి వీరిద్ద‌రికీ ఆ అవ‌స‌రం ఎందుకొచ్చింది? అదీ ఏకంగా కూలీ డ్ర‌స్సులో.. వెయిట్ అండ్ వాచ్‌.. ఎఫ్‌2 @సంక్రాంతికి.