V Review
లాక్డౌన్ వల్ల మూత పడ్డ థియేటర్స్ ఇంకా తెరుచుకోవడం లేదు. దానికి ఇంకా సమయం పట్టేలాగానే అనిపిస్తోంది. నిర్మాతలకు ఇప్పుడు డిజిటల్ మీడియం మాత్రమే శరణ్యంగా కనిపిస్తోంది. టాలీవుడ్ విషయానికి వస్తే కాస్త కూస్తో... చిన్నా చితక చిత్రాలు మాత్రమే ఓటీటీలో ఇప్పటి వరకు సందడి చేశాయి. కానీ ఓ పేరున్న స్టార్స్ కలిసి చేసిన చిత్రమేది విడుదల కాలేదు. తొలిసారి తెలుగులో ఓటీటీ ద్వారా విడుదలైన ఆ చిత్రమే ‘వి’. నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి తదితరులు నటించిన ఈ చిత్రం నాని 25వ చిత్రం. అంతే కాదు.. నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో ‘అష్టాచమ్మా, జెంటిల్‌మన్’ చిత్రాల తర్వాత వచ్చిన మూడో చిత్రం ‘వి’. నాని, దిల్‌రాజు హ్యాట్రిక్ మూవీ..ఇలాంటి కొన్ని విషయాలు సినిమాపై ప్రేక్షకుల్లో అటెన్షన్‌ను క్రియేట్ చేశాయి. అంతే కాకుండా నాని నెగటివ్ షేడ్ చేస్తున్నాడు అంటూ చేసిన ప్రచారం సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి సినిమా ఈ హైప్స్‌ను రీచ్ అయ్యిందా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ:
డీసీపీ ఆదిత్య(సుధీర్‌బాబు) డ్యూటీలో జాయిన్ అయిన కొన్ని రోజుల్లోనే పాతబస్తీలో అల్లర్లు జరుగుతాయి. అందులో ముప్పై మంది ప్రాణాలను కాపాడి ప్రశంసలు, పతకాలు తీసుకుంటాడు. క్రమక్రమంగా సూపర్‌కాప్ ఇమేజ్‌ను పెంచుకుంటూ వస్తాడు సుధీర్‌బాబు. ఈ క్రమంలో తనకు అపూర్వ(నివేదా థామస్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ను హీరోగా పెట్టి ఓ క్రైమ్ నవల రాయాలనుకుంటూ ఉంటుంది. ఆదిత్య సూపర్ కాప్ కావడంతో అతన్నే హీరోగా అనుకుని ఓ నవల రాయాలనుకుంటుంది. అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఓ కిల్లర్(నాని) ఓ పోలీస్ ఆఫీసర్‌ను చంపేసి ఆదిత్యకు సవాలు విసురుతాడు. మరో నాలుగు హత్యలు కూడా చేస్తానని ఆదిత్యకు ఫోన్ చేసి చెబుతాడు. దీంతో ఆదిత్య సదరు కిల్లర్‌ను పట్టుకోవడానికి తన ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈలోపు కిల్లర్ మల్లిఖార్జున్(మధుసూదన్) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని హత్య చేస్తాడు. సుధీర్‌కు తన తదుపరి హత్య ఎక్కడ చేస్తాననే దానిపై చిన్న క్లూ కూడా ఇస్తాడు. ఆదిత్య ఆ క్లూ సాయంతో కిల్లర్‌ను పట్టుకోవడానికి ముంబై చేరుకుంటాడు. అప్పటికే కిల్లర్ మరో హత్య చేసేసి ఆదిత్యకు దొరక్కుండా తప్పించుకుంటాడు. అదే సమయంలో కిల్లర్ తనకు తాను ఎవరు? అనే దానిపై ఆదిత్యకు ఓ క్లూ ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకుని ఆదిత్య ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆదిత్యకు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలేంటి? విష్ణు ఎవరు? కిల్లర్‌కు ఆర్మీతో ఉన్న సంబంధమేంటి? వరుస హత్యలు చేసి సవాలు విసరడానికి కారణమేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
ఈ సినిమా గురించి ప్రస్తావించాలంటే ముందుగా నాని గురించి చెప్పాలి.. నేటితరం హీరోల్లో పేరున్న స్టార్ ఇతను. డిఫరెంట్‌గా ఏదో ప్రయత్నం చేయాలనే ఆలోచనతో తన 25వ సినిమాలోనే నెగటివ్ షేడ్ ఉన్న హంతకుడు పాత్రలో కనిపించడానికి ఒప్పుకోవడం చూస్తే తనను అభినందించాల్సిందే. సినిమా టీజర్, ట్రైలర్ ఇతర విషయాలను చూస్తే కచ్చితంగా నాని రాక్షసత్వం ఉన్న ఓ విలన్‌గా మనకు కనిపిస్తాడు. అసలు తనేంటి? ఇలాంటి పాత్ర ఎందుకు చేశాడు? అనే ఆసక్తిని క్రియేట్ చేయడంలో యూనిట్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. నాని లుక్, డైలాగ్ డెలివరీ తన ఇతర సినిమాలతో పోల్చితే డిఫరెంట్‌గా ఉంది. ఇక సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాలకే నాని, సుధీర్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ అవుతుంది. దాదాపు ఫస్టాఫ్ హాఫ్ వరకు ఈ గేమ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. నాని పాత్ర ఎందుకు హత్యలు చేసిందనే విషయాన్ని చెప్పకుండా సినిమాను చాలా ఆసక్తిగా నడిపించడంలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సక్సెస్ అయ్యాడు. అయితే సెకండాఫ్ విషయానికి వస్తే నాని పాత్ర హైలైట్ అయ్యి.. సుధీర్ పాత్ర డల్ అయిపోయింది. సినిమా అంతా నాని పాత్ర చుట్టూనే తిరుగుతుంది.
సినిమా ప్రమోషన్స్ లో కనపడని అదితిరావు హైదరి పాత్ర కూడా సెకండాఫ్‌లోనే ఎంట్రీ ఇస్తుంది. పోనీ అబ్బో అనుకునేలా ఈ పాత్ర ఉండదు. నాని, అదితి మధ్య లవ్‌ట్రాక్ మరీ డ్రెమటిక్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఆర్మీ ఎపిసోడ్స్, నాని-అదితి లవ్‌ట్రాక్ ఇవన్నీ బోరింగ్‌గా అనిపిస్తాయి. అప్పటి వరకు ఉన్న గ్రిప్ సడలుతుంది. అసలు విలన్ సుధీరేనా? అనే అనుమానపడ్డ ప్రేక్షకుడికి అదేం లేదు అనిపిస్తుంది. అదితి పాత్ర స్వభావాన్ని మరికాస్త హైలైట్ చేసుంటే బావుండేదనిపించింది. దర్శకుడు ఇంద్రగంటి సెకండాఫ్‌పై ఫోకస్ పెట్టి ఉంటే బావుండేదనిపించింది. ఫస్టాఫ్ ఉన్నంత ఆసక్తికరంగా సెకండాఫ్ లేదు. అమిత్ త్రివేది సంగీతం బావుంది. తమన్ నేపథ్య సంగీతం, బిశ్వదీప్ చటర్జీ సౌండ్ డిజైన్ బావున్నాయి. పి.జి.విందా సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. పాటలు సందర్భానుసారం ఉన్నాయి. బాగానే ఉన్నాయి. కానీ.. హమ్ చేసుకునేంత గొప్పగా లేవు. డైలాగ్స్ ట్రైలర్ విన్నంత ఎఫెక్టివ్‌గా సినిమాలో కనిపించలేదు.
వి సినిమా రిజల్ట్ బేస్ చేసుకుని తమ సినిమాలను ఓటీటీ ప్లాన్ చేద్దామనుకున్న స్టార్స్‌ను వి సినిమా ఆలోచనలో పడేస్తుందనడంలో సందేహం లేదు.
చివరగా.. వి... ఫర్ విక్టరీ కాదు, విలనిజమూ కాదు.. జస్ట్... విష్ణు అంతే!
Read 'V' Movie Review in English
- Read in English