ఏపీ: సినిమా టికెట్ ధరల తగ్గింపు రగడ.. ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌కి ‘‘ లాక్ ’’
- IndiaGlitz, [Saturday,December 25 2021]
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారులు కొన్ని రోజులుగా తనిఖీలు చేస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, సినిమా టికెట్ల ధరలను తగ్గించాల్సిందేనంటూ ప్రభుత్వం పట్టుపట్టింది. విషయం కోర్టుల్లోకి వెళ్లినా జగన్ సర్కార్ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు థియేటర్లలో ప్రమాణాలు పాటించడం లేదని, నిబంధనలు ఉల్లంఘించారని ఏపీలోని పలు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తూ సీజ్ చేస్తున్నారు. దీంతో థియేటర్ యజమానులే స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 18 సినిమా హాళ్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. విజయవాడలోని అన్నపూర్ణ, శకుంతల, అప్సర థియేటర్లను అధికారులు తనిఖీ చేసి వాటిలోని క్యాంటీన్లలో ధరల పట్టికను పరిశీలించారు. మొత్తంగా కృష్ణాజిల్లాలో 30 థియేటర్లు మూతపడ్డాయి.
తాజాగా నెల్లూరు నగరం.. సూళ్లూరుపేట జాతీయ రహదారిపై ఉన్న ప్రఖ్యాత వి-ఎపిక్ థియేటర్‌ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ కలిగిన ఈ థియేటర్‌లో సినిమాని చూసేందుకు సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35కి అనుగుణంగా థియేటర్లు నడపడం సాధ్యం కాదని.. అందువల్ల థియేటర్‌ని కొన్నిరోజులపాటు మూసివేస్తున్నామని యాజమాన్యం తెలిపింది. అయితే విషయం తెలియకపోవడంతో థియేటర్‌కు వచ్చిన సినీ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.