భూ ప్రపంచం మీదే ‘మోదీ’ గొప్పనేత : ట్రంప్
Send us your feedback to audioarticles@vaarta.com
గుజరాత్‌లోని మెతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ట్రంప్ కూడా ప్రసంగించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన.. మోదీని ఆకాశానికెత్తేశారు. అంతేకాదు.. భారత్‌లో ఉన్న అవకాశాలు, మోదీ చేపడుతున్న కార్యక్రమాల గురించి కూడా ప్రస్తావించారు. మొదట.. ‘నమస్తే’ అంటూ ట్రంప్ ప్రసంగం ప్రారంభించారు.
భూ ప్రపంచం మీదే మోదీ గొప్పనేత!
‘నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మోదీకి కృతజ్ఞతలు. 8 వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చాం. భూ ప్రపంచం మీదే మోదీ గొప్పనేత. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనడానికి మోదీయే నిదర్శనం. చాయ్ వాలా నుంచి ప్రధాని స్థాయికి రావడం మామూలు విషయం కాదు. అమెరికన్ల హృదయాల్లో ఇండియాకు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికా ఎప్పుడూ భారత్‌ను ప్రేమిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి మమ్మల్ని ఆహ్వానించారు. మొతేరా స్టేడియం చాలా అధ్బుతంగా ఉంది. 1.20లక్షల మందిని ఒకేచోట చూడటం చాలా ఆనందంగా ఉంది. మోదీ నా ఫ్రెండ్ అనిచెప్పడానికి గర్విస్తున్నాను. ఇండియాకు రావడం గర్వంగా భావిస్తున్నాను. అభివృద్ధి కోసం మోదీ నిరంతరం కృషి చేస్తున్నారు. పారిశుద్ధ్యం, పేదరిక తగ్గుదలలో మోదీ అద్భుత విజయాలు సాధిస్తున్నారు. భారత్ అద్భుతమైన అవకాశాలకు నెలవు. ప్రజలకు స్వేచ్ఛనిచ్చి తన కలలను సాకారం చేసుకునే దిశగా భారతావని తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది’ అని మోదీని ట్రంప్ ఆకాశానికెత్తేశారు.
ఆ రెండు సినిమాలు చాలా గొప్పవి!
ఈ సందర్భంగా భారతీయ హోలీ, దీపావళి పండుగలను ట్రంప్ ప్రస్తావించారు. భారత్‌లో ఒక్కో విజయానికి ప్రతీకగా ఒక్కో పండుగ జరుపుకుంటారని ఆయన గుర్తు చేశారు. భారతీయ సినిమాలు చాలా గ్రేట్ అంటూ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘దిల్వాలే దుల్హానియా’, ‘షోలే’ చిత్రాలు చాలా గొప్పవని ట్రంప్ చెప్పుకొచ్చారు. ప్రజల హక్కుల రక్షణలో ఇరు దేశాలకు ఉన్న శ్రద్ధే భారత్, అమెరికాలను స్నేహితులుగా మార్చాయన్నారు. అమెరికాకు గుజరాతీలు అందించిన సహకారం చాలా గొప్పదని.. ఈ రోజు సాయంత్రం ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను సందర్శిస్తానని ట్రంప్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. మోదీని ఆకాశానికెత్తేయడానికి సంబంధించిన వార్తలను చూసిన పలువురు విమర్శకులు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు.. ట్రంప్‌కు ఎవరబ్బా ఈ స్క్రిప్ట్ రాసిచ్చింది.. కొంపదీసి మోదీ రాసిచ్చిన స్క్రిప్ట్ ఆయన అచ్చుగుద్దినట్లుగా చదివేశారేమో అని సెటైర్లు కూడా వేస్తున్నారు. మరి ట్రంప్ పర్యటనపై కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout