ఉద్ధవ్ సమక్షంలో శివసేనలో చేరిన నటి ఊర్మిళ
- IndiaGlitz, [Wednesday,December 02 2020]
బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ మంగళవారం శివసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఊర్మిళ రాజకీయాల్లో మాత్రం ఆశించినంతగా రాణించలేకపోయారు. దీంతో కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాగా.. ఇటీవల కొద్ది రోజలుగా ఆమె శివసేనలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆమెకు శివసేన ప్రభుత్వం ఎమ్మెల్సీని కూడా కన్ఫర్మ్ చేసిందని వార్తలు వినిపించాయి.
ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన సారథ్యంలోని మహాకూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊర్మిళ మటోండ్కర్ గత ఏడాది రాజీనామా చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ నేతల తీరే తన ఓటమికి కారణమని భావించిన ఆమె గత ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీని వీడారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఊర్మిళ నేడు శివసేనలో చేరారు. శివసేనలో ఊర్మిళ చేరికపై రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె శివసైనికురాలని, ఆమె రాకతో పార్టీ మహిళా విభాగం మరింత బలపడతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.