Civils Results:సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల .. తెలంగాణ అమ్మాయికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్
- IndiaGlitz, [Tuesday,May 23 2023]
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 933 మంది అభ్యర్ధులను యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో జనరల్-345, ఈడబ్ల్యూఎస్-99, ఓబీసీ-263, ఎస్సీ-154, ఎస్టీ-72 మంది అభ్యర్థులు వున్నారు. అలాగే ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్‌ఎస్-38 మంది, ఐపీఎస్-200 మంది, సెంట్రల్ సర్వీసెస్-ఎ-473 మంది, గ్రూప్-బి సర్వీసులకు 131 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ తెలిపింది. ఇషితా కిశోర్ అఖిల భారత స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. ఆ తర్వాత గరిమా లోహియా, ఉమా హారతి (తెలంగాణ), ఎన్ స్మృతి మిశ్రా నిలిచారు. అటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటారు. జీవీఎస్ పవన్ దత్తాకు 22వ ర్యాంక్, శాఖమూరి శ్రీసాయి అర్షిత్‌కు 40వ ర్యాంక్, ఆవుల సాయికృష్ణకు 94, అనుగు శివమారతీ రెడ్డికి 132వ ర్యాంక్ వచ్చింది.
కాగా.. అఖిల భారత స్థాయి పోస్టులకు గాను యూపీఎస్సీ ప్రతియేటా సివిల్ సర్వీస్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంపికైన వారికి ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు కేటాయిస్తారు. గతేడాది జూన్ 25న దేశంలోని 72 నగరాల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. ఇందులో అర్హత సాధించిన 11,845 మంది అభ్యర్ధులకు సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు మెయిన్స్ నిర్వహించింది. ఇందులోనూ అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలిచింది. అనంతరం ఎంపికైన అభ్యర్ధులను ఈరోజు ప్రకటించింది.