మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చాలా మంది హీరోలు తెలుగు చిత్రసీమలో రాణిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నవారే. ఆ క్రమంలో మెగా కుటుంబం నుంచి పరిచయమైన మరో హీరో వైష్ణవ్ తేజ్. సాయితేజ్ సోదరుడైన వైష్ణవ్‌తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’. గత ఏడాదినే విడుదల కావాల్సిన ‘ఉప్పెన’ మూవీ, కోవిడ్ ప్రభావంతో ఆలస్యమైంది. ఒకానొక దశలో ‘ఉప్పెన’ మూవీని ఓటీటీలో విడుదల చేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే నిర్మాతలు సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేసి, థియేటర్స్‌లోనే విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. అలా ఈ శుక్రవారం(ఫిబ్రవరి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ ఉప్పెనను సాధించిందా? లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
విశాఖ తీర ప్రాంతంలోని ఉప్పాడ గ్రామంలో చేపలు పడుతూ జీవనం సాగించే వ్యక్తి జానయ్య(సాయిచంద్). భార్య చనిపోవడంతో కొడుకు ఆశీర్వాదం అలియాస్ ఆశి(వైష్ణవ్ తేజ్)ను ప్రేమతో పెంచుకుంటాడు. ఆశికి చిన్నప్పటి నుంచి సంగీత అలియాస్ బేబమ్మ(కృతిశెట్టి) అంటే ఇష్టం. ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది. సంగీత ఎవరో కాదు.. ఉప్పాడ గ్రామ పెద్ద, డబ్బు, పలుకుబడి గల వ్యక్తి శేషగిరి రాయనం(విజయ్ సేతుపతి) కూతురు. పరువు కోసం ఏమైనా చేసే వ్యక్తి రాయనం. ఉప్పాడలో మత్స్యకారులను తరిమేసి అక్కడ మార్కెట్ యార్డ్ కట్టాలని గట్టి ప్రయత్నాల్లో ఉంటాడు. తన కూతురు ఎవరితో ప్రేమలో పడకూడదని రాయనం ఆమెను పట్నంలో ఉమెన్స్ కాలేజ్‌లో చేర్పించడంతో పాటు, ఆమె కోసం ప్రత్యేకంగా బస్సును గ్రామానికి రప్పిస్తాడు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఆశికి తనపై గల ప్రేమను తెలుసుకున్న సంగీత కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్న సమయంలో కొన్ని పరిస్థితుల ప్రభావంతో రాయనం ఆశి, సంగీత ప్రేమించుకుంటున్నారని తెలుస్తుంది. అప్పుడు రాయనం చేసే పనుల వల్ల జానయ్య చనిపోతాడు. ఆశి, సంగీత ఊరు నుంచి పారిపోతారు. అప్పుడు రాయనం ఏం చేస్తాడు? చివరకు ప్రేమ వల్ల ఆశి ఏం కోల్పోయాడు? ఆశి, సంగీత ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
నటీనటుల విషయానికి వస్తే.. సినిమాలో మూడు పాత్రలో ప్రధానం. మెగా ఫ్యామిలీ హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా వారి తోడుగా 'ఉప్పెన' సినిమాతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. వైష్ణవ్ తేజ్ యాక్షన్ సినిమా కాకుండా తొలి సినిమాను లవ్‌స్టోరిగా చేయాలనుకోవడం తనకెంతో ప్లస్ అయ్యిందనే చెప్పాలి. అది కూడా సుకుమార్ వంటి దర్శకుడు, మైత్రీ మూవీస్ కాంబినేషన్ మూవీ కావడంతో వారు తీసుకునే జాగ్రత్తలను పాటిస్తూ వైష్ణవ్ చేసిన ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మంచి స్టెప్ వేశాడనే చెప్పాలి. ఎక్కడా నేను డెబ్యూ హీరో. ఎవరు ఏమనుకుంటారో అనే బెరుకుతో నటించినట్లు అనిపించలేదు. పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. డైలాగ్ డెలివరీ, ఉచ్చారణ చక్కగా ఉంది. ఇక మలయాళ ముద్దుగుమ్మ కృతిశెట్టి తన నటనతోనే కాదు, ఎక్స్‌ప్రెషన్స్‌తోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమాలో కృతి హావభావాలు కుర్రకారు మనసును దోచేస్తాయనడంలో సందేహం లేదు. ఇక సినిమాలో విలన్‌గా చేసిన విజయ్ సేతుపతి, తన నటనతో సినిమాలో మరో లెవల్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. బ్యాలెన్స్‌డ్‌గా విజయ్ సేతుపతి చేసిన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతారనడంలో సందేహం లేదు. ఇక సాయిచంద్ పాత్ర.. హీరోగా తండ్రి చక్కగా ఒదిపోయాడు. మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు.
ఇక సాంకేతికంగా చూస్తే బుచ్చిబాబు తొలి సినిమానే అయినా ఎక్కడా కన్‌ఫ్యూజన్‌తో చేసినట్లు కనిపించలేదు. క్లారిటీతో సీన్ బై సీన్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. అఫ్‌కోర్స్ సుకుమార్ సపోర్ట్ ఉండనే ఉండి ఉంటుంది కాబట్టి ఆ విషయంలో బుచ్చిబాబు టెన్షన్ పడే పనిలేకుండా పోయింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మేజర్ ఎసెట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే పాటలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. నేపథ్య సంగీతం బావుంది. ఇక శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీ సన్నివేశాలను ఫ్రెష్ లుక్‌తో చూపించారు. సంభాషణలు బావున్నాయి.
అయితే మన ప్రేక్షకులకు ఇంత రా నెస్ కొత్త కదా.. ఎలా రిసీవ్ చేసుకుంటారోననిపిస్తుంది. కొత్త ప్రేమకథను చూద్దాం అనుకుంటే మాత్రం కష్టమే. ఎందుకంటే ధనికురాలైన హీరోయిన్, పేదవాడైన హీరో.. ఇద్దరి మధ్య ప్రేమ, అడ్డంకులు. వాటిని దాటే క్రమంలో వారెలాంటి సమస్యలు ఎదుర్నారనేదే ఉప్పెన కాన్సెప్ట్.
బోటమ్ లైన్: ఉప్పెన.. పాయింట్ పాతదే అయినా ప్రేమ.. దేవుడు ఒకటే అంటూ కొత్తగా చెప్పే ప్రయత్నం
Comments