Upasana:తమ కుటుంబంలో ఇద్దరు పద్మవిభూషణులు.. చాలా గర్వంగా ఉంది: ఉపాసన
- IndiaGlitz, [Saturday,January 27 2024]
మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కడం పట్ల ఆయన కోడలు, రామ్‌చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఆమె తాత డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికి కూడా పద్మవిభూషణ్ వచ్చింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.
తమ కుటుంబంలో ఇద్దరు పద్మవిభూషణులు ఉన్నారని ఉపాసన తెలిపారు. ఒకరు తన తాతయ్య డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, మరొకరు తన మామయ్య చిరంజీవి కొణిదెల అని వివరించారు. తమ కుటుంబానికి ఇంతటి విశిష్ట గౌరవం దక్కడం ఆ దేవుడి ఆశీర్వచనంలా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె తాత, మామకలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.
140 కోట్ల మంది దేశంలో ఇప్పటివరకు కేవలం 336 మందికి మాత్రమే పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి అవార్డు దక్కడం అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. వారే ఉపాసన తాత అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి.
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడిగా డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి వైద్య రంగంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను దేశంలో అందించాలనే ఆయన నిబద్ధత, సేవలకు గానూ 2010లో పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. ఇక భారతీయ చిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేశారు చిరంజీవి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. నెంబర్ వన్ హీరోగా దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానులను అలరించారు. అలాగే ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి సేవ చేశారు. ఇందుకు గానూ తాజాగా చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది.
అంతేకాకుండా ఇద్దరికీ గతంలో పద్మభూషణ్ అవార్డు కూడా రావడం విశేషం. ప్రతాప్ సి రెడ్డికి కేంద్రం 1991లో పద్మ భూషణ్ ప్రకటించగా.. 2006లో చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. దీంతో తమ కుటుంబం నుంచి ఇద్దరు దిగ్గజాలకు దేశంలోనే అత్యున్నత పురస్కారాలు రావడం పట్ల వారసులు, అభిమానులు సంబరపడిపోతున్నారు. వారి వారసత్వాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తామని ప్రకటిస్తున్నారు.
honoured & blessed to have 2 #PadmaVibhushan 🙏 awardees in the Family.
— Upasana Konidela (@upasanakonidela) January 27, 2024
My Grandfather Dr Prathap C Reddy &
My Father in law Dr Chiranjeevi Konidela @KChiruTweets @DrPrathapCReddy https://t.co/F3nfmPLAA4 - my LinkedIn pic.twitter.com/hBXvDv4umA