పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పై ఉపాసన కొణిదెల క్లారిటీ
- IndiaGlitz, [Monday,January 28 2019]
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవీ కోడలు, హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల రాజకీయాల్లోకి వస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉపాసన పోటీ చేస్తారని జాతీయ మీడియా సైతం కథనాలు రాసింది. గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కొండా విశ్వేశ్వరరెడ్డి శాసనసభ ఎన్నికల సమయంలో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం విదితమే. దీంతో సిట్టింగ్ స్థానం చేజారిపోకూడదని టీఆర్ఎస్ అధినాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఈ సందర్భంగా చేవెళ్ల నుంచి చిరంజీవి కోడలు ఉపాసనను బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త ఆ నోటా.. ఈ నోటా పడి ఉపాసన దగ్గరకి చేరడంతో సోషల్ మీడియా వేదికగా ఎట్టకేలకు ఆమె క్లారిటీ ఇచ్చేశారు.
ఉపాసన రియాక్షన్..
చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిపై నేను టీఆర్ఎస్ తరుపున పోటీచేస్తున్నట్లుగా వచ్చిన వార్త అంతా అవాస్తవమే. అందులో ఎంత మాత్రం నిజం లేదు. నేను ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ను ప్రేమిస్తున్నానని సంగీతా రెడ్డి(కొండ విశ్వేశ్వర రెడ్డి భార్య) నా బాస్. చిన్నాన్న(విశ్వేశ్వర రెడ్డి) చేవెళ్లలో మంచి పనులు చేస్తున్నారు అని ఉప్సీ క్లారిటీ ఇచ్చారు.
కాగా.. ఇలా సినీ నటీనటులు, సెలబ్రిటీలపై ఇలా రూమర్లు వచ్చిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఉపాసన కుటుంబానికి, ఇటు చిరు కుటుంబానికి భారీ బ్యాగ్రౌండ్ ఉండటం.. పైగా జాతీయ మీడియాలో వార్తలు రావడంతో ఇదంతా నిజమేనని అభిమానులు భావించారు. అయితే జనసేనలోకి రావాలని కొందరు మెగాభిమానులు ఆహ్వానించగా.. మరికొందరు ఏపీ నుంచి పోటీ చేయండని సూచిస్తున్నారు. మున్ముంథు ఉపాసన రాజకీయాల్లోకి రావాలని రాసిపెట్టుందేమో వేచి చూద్దాం మరి.