'వెన్నుపోటు' అంటేనే కన్నీళ్లొస్తున్నాయి... బాలయ్య 'అన్ స్టాపబుల్' ప్రోమో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం మహోన్నతంగా వెలుగొంది.. చివర్లో విషాదకరంగా ముగిసింది. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ కంచుకోటను బద్ధలుకొట్టి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్.. రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. ప్రతిపక్షంలో కూర్చొన్నా.. తిరిగి 1994 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఆయన సీఎం అయ్యారు. అయితే ఆ తర్వాత లక్ష్మీపార్వతి, చంద్రబాబు మధ్య మనస్పర్థలు ‘‘వైశ్రాయ్’’ ఇన్సిడెంట్‌కు దారి తీసి రామారావు పదవితో పాటు పార్టీని కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబసభ్యులు, అల్లుడి చేతిలో జరిగిన ఈ పరాభవం ఆయనను తీవ్రంగా కుంగదీసింది. ఈ క్రమంలో 1996 జనవరి 18న ఎన్టీఆర్ .. తెలుగుజాతిని శోకసంద్రంలో ముంచి అనంత లోకాలకు వెళ్లిపోయారు.
అయితే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ప్రధానంగా చంద్రబాబును ఈ ‘‘వెన్నుపోటు’’ దారుడు అంటూ ఈ నాటికీ ప్రత్యర్ధులు ఆరోపిస్తుంటారు. ఆయన రాజకీయ జీవితంలో వైశ్రాయ్ ఘటన మాయని మచ్చగా మారిపోయింది. ఇటీవల ఆ ప్రచారం తారాస్థాయికి చేరింది. ఎన్టీఆర్ కుమార్తె, నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ ఓ ఇంటర్వ్యూలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అదే విధంగా మాట్లాడారు. దానిపై ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు కంట తడి పెట్టుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు సైతం ప్రెస్‌మీట్ పెట్టి ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఎట్టకేలకు వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘‘వెన్నుపోటు’’ అన్న పదం బాలయ్య నోటి వెంట వచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘‘ఆహా’’లో అన్ స్టాపబుల్ పేరుతో బాలయ్య షో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి లేటేస్ట్ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో వెన్నుపోటు పొడిచారనేది తప్పుడు ప్రచారం అని అలాంటి వ్యాఖ్యల గురించి వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయని బాలకృష్ణ ఆవేదన చెందారు. "నేను ఆయన (ఎన్టీఆర్) కొడుకుల్లో ఒకడిని, అభిమానుల్లో ఒకడిని" మరోసారి కుండబద్ధలు కొట్టారు నందమూరి నటసింహం. మరి ఇంకా ఆయన ఏం చెప్పారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout