Unstoppable2: డార్లింగ్ గర్ల్‌ఫ్రెండ్స్‌‌ని లాగాలని చూసిన బాలయ్య... నాకు పెళ్లి రాసిపెట్టి లేదు : ప్రభాస్ షాకింగ్ కామెంట్స్

  • IndiaGlitz, [Thursday,December 29 2022]

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘‘ఆహా’’లో ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్ 2 ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సీజన్‌లో ఇప్పటికే పలువురు స్టార్స్ ఈ షోకు గెస్ట్‌లుగా వచ్చారు. ఇక.. ప్రభాస్- గోపీచంద్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ఆహా టీమ్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్‌ను రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీనిలో భాగంగా ఫస్ట్ పార్ట్ ప్రోమోను బుధవారం రిలీజ్ చేశారు. ఫ్యాన్స్‌కు నచ్చే విధంగా ప్రోమోను కట్ చేశారు మేకర్స్.

బాలయ్య ప్రశ్నకు ప్రభాస్ (Prabhas) తెలివైన సమాధానం :

నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతారు.. నేను కూడా నీ మాయలో పడిపోయానంటూ బాలయ్య ప్రోమో మొదలెడతారు. ఆ వెంటనే ఇంతకీ పెళ్లి వుందా లేదా అని ఆయన అడుగుతారు. దీనికి డార్లింగ్ స్పందిస్తూ... రాసిపెట్టి లేదు సార్ అని ఆన్సర్ ఇస్తారు.దీనికి బాలయ్య కూడా వెంటనే మీ అమ్మకు చెప్పిన మాటలు చెప్పకయ్యా అని కౌంటర్ వేశారు. అలాగే నిన్ను గర్ల్‌ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు అని బాలయ్య చిలిపిగా అడిగితే.. అదేదో ట్యాబ్లెట్ వేసుకున్నా సార్..అన్ని మరిచిపోతున్నా అని ప్రభాస్ తెలివిగా ఆన్సర్ ఇచ్చారు.

ఫస్ట్ నా సినిమా .. తర్వాతే మీ నాన్న సినిమా : చరణ్‌కు బాలయ్య ఫోన్

కాసేపటికి హీరో గోపిచంద్ వచ్చినట్లు చూపించారు. 2008లో ఏదో హీరోయిన్ కోసం గొడవపడ్డారని.. బాలకృష్ణ (Balakrishna)అడుగుతారు. దీనికి గోపీచంద్ 2008 కాదు అని చెప్పబోతుండగా ప్రభాస్ ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. షో మధ్యలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు బాలకృష్ణ ఫోన్ చేస్తారు. సంక్రాంతికి ముందు తన సినిమా చూసి.. తర్వాత మీ నాన్నగారి సినిమాకు వెళ్లు అని చెప్పడంతో ప్రోమో ముగిసింది.మొత్తానికి ప్రోమో చూసినవాళ్లకు మాత్రం నవ్వులే నవ్వులని చెప్పొచ్చు. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రభాస్- గోపీచంద్ ఫస్ట్ ఎపిసోడ్ ఆహాలో డిసెంబర్ 30న స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు.. ప్రభాస్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ ఎపిసోడ్ రానుండటంతో అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇదే ఎపిసోడ్‌లో దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్‌లు కూడా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ అవుతుందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆహా వర్గాలు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.