కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనాతో మృతి
- IndiaGlitz, [Thursday,September 24 2020]
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన పరిస్థితి విషయమించడంతో రాత్రి తుదిశ్వాస విడిచారు. కరోనాతో మృతి చెందిన తొలి కేంద్ర మంత్రి సురేష్ అంగడి కావడం గమనార్హం. సురేష్ అంగడి కర్ణాటకలోని బెళగావిలో 1955 జూన్ 1న జన్మించారు. ఆయనకు భార్య మంగల్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
1996లో ఆయన బీజేపీ బెల్గాం జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం బెల్గాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగానూ.. ఆ తరువాత బీజేపీ బెల్గాం జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2004లో సురేష్ అంగడి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో రెండోసారి.. 2014 మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో కూడా ఆయన లోక్‌సభకు ఎన్నికవడంతో బీజేపీ ఆయనకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా నియమించింది.