చిరంజీవి మానవత్వానికి కేంద్రమంత్రి ఫిదా!

మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. తన నటనతో ఇండస్ట్రీలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న చిరంజీవి.. సేవా దృక్పధంతో మానవత్వంలోనూ తాను ముందు వరుసలోనే ఉంటానని చిరు నిరూపించుకున్నారు.

ఇదీ చదవండి: జమ్మూలో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన.. జగన్ నిర్ణయంతో హిందూ ధర్మ ప్రచారం

గత ఏడాది కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి సినీ కార్మికుల్ని, ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకునేందుకు చిరంజీవి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తూనే.. కరోనా విలయతాండవాన్ని తట్టుకుని నిలబడనేందుకు ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు.

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, మెగా అభిమానుల సహకారంతో ఆక్సిజన్ బ్యాంక్స్ నిర్వహణ విజయవంతంగా కొనసాగుతోంది. దీనిపై చిరంజీవికి అన్నివర్గాల వారి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవి మానవత్వానికి, ఆయన సేవా కార్యక్రమాలకు ఫిదా అయ్యారు.

స్వయంగా కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా చిరుపై ప్రశంసలు కురిపించారు. 'మనిషి ప్రాణాలు కాపాడడం అనేది మానవత్వానికి గొప్ప సేవ. చిరంజీవి గారు చేస్తున్న నిస్వార్థంతో కూడిన, ప్రభావవంతమైన సేవా కార్యక్రమాలు హృదయాన్ని హద్దుకుంటున్నాయి. కరోనా సమయంలో ప్రాణాలు నిలబెట్టేందుకు ఇలాంటి సేవలు చాలా ఉపయోగపడుతాయి' అని చిరంజీవిపై కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. చిరంజీవి తిరిగి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఇది తనవంతు సాయం మాత్రమే అని అన్నారు.