Amit Shah:ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల వేళ ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కుటుంబపరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది కానీ రాజకీయాల్లో ఇది సెట్ కాదన్నారు. రాజకీయ కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు. తమ మిత్రులను తాము ఎప్పుడూ దూరం చేసుకోలేదని.. వారి రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా దూరమయ్యారని చెప్పారు. ఇందులో భాగంగానే ఏపీలో పొత్తులు ఓ కొలిక్కి వచ్చాయని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేశామని.. అందుకే దేశ ప్రజలు కమలం పార్టీకి 370 సీట్లు ఇస్తారని తెలిపారు. మొత్తంగా ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని ఆశిస్తున్నట్లు షా వెల్లడించారు. పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలను బట్టి త్వరలోనే టీడీపీ లేదా వైసీపీ ఎన్డీఏలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో గంటపాటు భేటీ అయి పొత్తుల గురించి చర్చించారు. అనంతరం సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఎన్డీఏలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీకి ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు ఆ పార్టీకి రాలేదు. కానీ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బీజేపీతో కలిసేందుకు వెంపర్లాడుతున్నాయి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా.. మూడో సారి కూడా గెలుస్తుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం మద్దతు అవసరమని భావిస్తున్నాయి. అందుకే ఎన్డీఏలో చేరేందుకు మొగ్గు చూపుతున్నాయి.
అయితే కాషాయం పెద్దలు పొత్తులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీతో వెళ్తే మెరుగైన సీట్లు వస్తాయో.. దీర్ఘ కాలిక ప్రయోజనాలు ఉంటాయో అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలను పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపే పొత్తును ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఏ పార్టీని తమ కూటమిలోకి ఆహ్వానిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout