Ungarala Rambabu Review
కమెడియన్ నుండి కథానాయకుడిగా మారిన సునీల్ చాలా కాలంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయినా హిట్ మాత్రం సునీల్ దరి చేరడం లేదు. అందుకే ఈసారి భిన్నంగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సునీల్ చేసిన సినిమా ఉంగరాల రాంబాబు. ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి ఫీల్ గుడ్, ఎమోషనల్ సినిమాలు తీసిన క్రాంతి మాధవ్ కామెడీ సినిమాను ఎలా తీశాడు? సునీల్‌ను తెరపై ఎలా చూపించాడో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం
కథ:
రెండు వందల కోట్లకు వారసుడైన రాంబాబు(సునీల్)ను తాతయ్య పెంచి పెద్ద చేస్తాడు.తాతయ్య మరణంతో అప్పుల వాళ్ల పాలవడంతో రాంబాబు బికారిగా మారుతాడు. బాదంబాబా(పోసాని కృష్ణమురళి) ఇచ్చిన సలహాలో రాంబాబు మళ్లీ కోటీశ్వరుడు అవుతాడు. అప్పటి నుండి బాదంబాబానే తన దైవంగా భావిస్తుంటాడు. ఓ ట్రావెల్స్ బిజినెస్ ప్రారంభిస్తాడు. సావిత్రి(మియాజార్జ్), రాంబాబు అఫీస్‌లోనే మేనేజర్‌గా జాయిన్ అవుతుంది. సావిత్రి, రాంబాబులోని మంచితనం చూసి అతన్ని ప్రేమిస్తుంది. ముందు సావిత్రిని తప్పుగా అర్థం చేసుకున్న రాంబాబు, ఆమె అదృష్టజాతకరాలని తెలిసి ఆమెకు తన ప్రేమను తెలియజేస్తాడు. నిజానికి సావిత్రి రంగ నాయర్(ప్రకాష్ రాజ్) కూతురు. రంగ నాయర్ కేరళలోని కమ్యూనిస్టు భావాలున్న గ్రామానికి అధిపతి. సావిత్రిని పెళ్లి చేసుకోవాలంటే రంగ నాయర్‌ను ఒప్పించాలని తెలుసుకున్న రాంబాబు ఆమె కోసం వాళ్ల గ్రామానికి చేరుకుంటాడు. అదే సమయంలో ఆ గ్రామం ఓ సమస్యను ఎదుర్కొంటూ ఉంటుంది. అప్పుడు రాంబాబు ఏం చేస్తాడు? ఊరి వాళ్ల సమస్యను తీర్చడానికి రాంబాబు ఏం చేశాడు? రాంబాబు, రంగ నాయర్‌ను ఒప్పిస్తాడా? రాంబాబు, సావిత్రిల పెళ్లి జరుగుతుందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
సునీల్ నటనలో గొప్ప తేడా ఏం మనకు కనపడదు. కానీ డ్యాన్సుల విషయంలో మెప్పించాడు. కమర్షియల్ హీరోగా రాణించే ప్రయత్నాల్లో సునీల్ చేసిన నటన ఆడియెన్స్‌కు గొప్పగా ఏమీ కనెక్ట్ కాదు. ఇక హీరోయిన్ మియాజార్జ్ పాటలకు మాత్ర్మే పరిమితం అయ్యింది. పెర్ఫామెన్స్‌కు పెద్దగా స్కోప్ లేదు. ఇక ఫస్టాఫ్‌లో బాదం బాబాగా పోసాని కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో ప్రకాష్ రాజ్ గతంలో ఎన్నో సినిమాల్లో కుటుంబ పెద్దగా, ఊరి పెద్దగా చేసిన క్యారెక్టర్‌నే ఇందులో కూడా చేశాడు. ప్రకాష్ రాజ్ తన క్యారెక్టర్ పరంగా చూస్తే సింపుల్‌గా చేసేశాడు. అయితే ప్రకాష్ రాజ్ పాత్రలో డెప్త్ కనపడదు. ఇలాంటి పాత్రలను ప్రకాష్ రాజ్ ఇది వరకు చాలా సినిమాల్లో చేసేశాడు కాబట్టి చాలా సునాయసంగా ఇందులో నటించాడు. ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటుడ్ని ఈ సినిమాలో సరిగా వాడుకోలేదు. బాదంబాబాగా నటించిన పోసాని కృష్ణమురళి తనదైన బాడీ లాంగ్వేజ్‌తో నవ్వించాడు. సెకండాఫ్‌లో వచ్చే వెన్నెల కిషోర్ పాత్ర కూడా అంతే. ఆశిష్ విద్యార్థి, రాజీవ్ కనకాల పాత్రలు చాలా పరిమితంగా ఉన్నాయి. సినిమాలో ఎక్కడా కొత్తదనం కనపడదు. కమ్యూనిస్టులు ఉన్న గ్రామం కావాలంటే అసలు కేరళకే ఎందుకు వెళ్లారో అర్థం కాదు. మన రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఉండరా, సరే కేరళలకు వెళ్లారే అనుకుంటే, అక్కడ కేరళీయులు ఒక్కరూ కూడా మలయాళంలో కాకుండా తెలుగులో మాట్లాడుతూ కనపడ్డారు. ఇలాంటి లోపాలు సినిమా నిండా కనపడ్డాయి. ఇక సాంకేతికంగా చూస్తే ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు వంటి సెన్సిబుల్స్ ఉన్న సినిమాలు తీసిన దర్శకుడు క్రాంతి మాదవ్ ఈ సినిమాను తీశాడా అనిపిస్తుంది. రియాలిటీకి దూరంగా, పాత కమర్షియల్ కథలను మళ్లీ రుద్దే ప్రయత్నం చేశాడు అలాగే సెకండాఫ్‌లో హీరో వంట వండే సీన్‌లో పాటలు సన్నివేశాలు ఇలా అన్ని ప్రేక్షకుడికి నవ్వు తెప్పించడం కంటే ఇబ్బందినే కలిగిస్తుంది. హీరో, హీరోయిన్ తండ్రిని ఒప్పించడానికి పడరాని పాట్లు పడటం, చివరకు ఆమె తండ్రిని ఒప్పించే సందర్భాల్లో హీరో మెప్పించడం ఇలాంటి సన్నివేశాలను చాలా సినిమాల్లో చూసేశాం. ఇక జిబ్రాన్ సంగీతం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత తక్కవ. ఒక ట్యూన్ కూడా ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సరేసరి. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ పరావాలేదు. ఉంగరాల రాంబాబు చిత్రంలో మొత్తంగా చూస్తే కొత్తగా చెప్పదేం ఉండదు. చూస్తే తలనొప్పి ఖాయమే.
బోటమ్ లైన్: ఉంగరాల రాంబాబు...బొంగరాలు తిరుగుతాయి మరి...
Ungarala Rambabu Movie Review in English
- Read in English