Memantha Siddham:'మేమంతా సిద్ధం' యాత్రకు అనూహ్య స్పందన.. చేతులెత్తేసిన టీడీపీ అభ్యర్థులు..
- IndiaGlitz, [Thursday,April 25 2024]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర బుధవారంతో ముగిసింది. గత నెల 27న ఇడుపులపాయ వేదికగా ఈ యాత్ర ప్రారంభంకాగా.. దాదాపు నెల రోజుల పాటు రాష్ట్రమంతా కొనసాగింది. 22 రోజులు పాటు 2,100 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సుయాత్ర 86 నియోజకవర్గాల మీదుగా సాగింది. ఈ యాత్రలో 16 బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. 6 ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యారు. 9 చోట్ల భారీ రోడ్ షోలు నిర్వహించారు.
ఈ యాత్రకు ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తే ప్రభుత్వం మీద ఉన్న కొంత వ్యతిరేకత కూడా తగ్గిందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ కూటమి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి జగన్ యాత్ర చాలా ఉపయోగిపడిందని పేర్కొంటున్నారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వల్ల ఓట్లు చీలడం కూడా తగ్గిపోతుందంటున్నారు. కాగా 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన పాదయాత్ర పార్టీకి ఎంత ప్లస్ అయిందో.. ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూడా పార్టీకి మైలేజ్ తీసుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
అంతకుముందు 2009లో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ ఎంపీగా చేపట్టిన ఓదార్పు యాత్ర అయినా.. వైఎస్‌ఆర్‌సీపీ అధినేతగా చేపట్టిన 3,000 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర అయినా విజయవంతమైందనే చెప్పాలి. అయితే ఓదార్పు యాత్ర నిర్వహించవొద్దని కాంగ్రెస్ పెద్దలు స్పష్టంచేయడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జగన్.. ప్రజా సమస్యలపై పోరాడుతూ దాదాపు 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు.
ఇప్పుడు కూడా అదే విధంగా 'మేమంతా సిద్ధం' యాత్రతో ప్రజలను తన వైపు తిప్పుకోగలిగారు. ఈ యాత్రకు ముందు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలు నిర్వహించారు. భీమిలి(విశాఖపట్నం జిల్లా), దెందులూరు(ఏలూరు జిల్లా), మేదరమెట్ల(బాపట్ల జిల్లా), రాప్తాడు(అనంతపురం జిల్లా)లలో జగన్ నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు జనాల నుంచి భారీ స్పందన వచ్చింది. అయితే టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఏర్పడటంతో వారిని ధీటుగా ఎదుర్కోవడంలో జగన్ బస్సు యాత్ర ప్రధాన పాత్ర పోషించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇక ఈ యాత్రలో భాగంగా ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కారణంగా కొంత సానుభూతి ఓటు లభిస్తుందని వైసీపీ నేతలు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీని ఓడించడం చాలా కష్టమని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ గెలవాలి అంటే చాలా కష్టపడాలి.. NDA కూటమిలో కలిసినా అంత మేలు జరగలేదని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. దీంతో ఆయన మాటలకు టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యారు. టీడీపీ అభ్యర్థులకే గెలుస్తామనే నమ్మకం లేదంటే.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.