ఇదే జరిగితే ‘ఈనాడు రామోజీరావు’ జైలుకే..!?
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించిందో.. ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావు జైలుపాలవ్వక తప్పదని.. సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రముఖ న్యాయవాదులు చెబుతున్నారు. అసలేం జరిగింది..? ఏ విషయంలో మీడియా మొఘల్కు చిక్కులు తప్పవు..? అనే ఆసక్తికర విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరిగింది!?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను రామోజీకి చెందిన ‘మార్గదర్శి’ సేకరించిందన్న వ్యవహారం అప్పట్లో పెను సంచలనమైన సంగతి తెలిసిందే. అయితే ఈ అభియోగంపై సెక్షన్ 45(టి), సెక్షన్ 58(ఇ) ఆధారంగా ‘మార్గదర్శి’ ఫైనాన్షియర్స్‌పై చర్యలు తీసుకునేందుకు 2006 డిసెంబర్ 19న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అయితే ఈ కేసును పరిశీలించేందుకు అప్పటి ఆర్థిక శాఖ సలహాదారు ఎన్.రంగాచారిని నియమించడం జరిగింది. అయితే దీనిపై న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసేందుకు అప్పటి సీఐడీ ఐజీ కృష్ణ రాజును అధీకృత అధికారిగా నియమించింది. అయితే ఈ ఉత్తర్వులను పక్కనపెట్టాలని కోరుతూ 2011లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సీసీ నెంబర్ 540లో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇచ్చింది. మరోమారు స్టే పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది.
రంగంలోకి దిగిన ఉండవల్లి!
ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఉండవల్లి.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చైర్మన్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం నిశితంగా విచారణ చేపట్టింది. రిజర్వు బ్యాంకు ప్రత్యేక అధికారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని.. ఈ మేరకు సవరించిన మెమోను దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు.. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అనంతరం ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణకు రెండు వారాలకు వాయిదా వేసింది.
ఊహించని దానికంటే..!
‘చట్టం ముందు అందరూ సమానులే. ఏదో ఒక వంకతో స్టేలు తెచ్చుకొని కేసు నుంచి తప్పించుకోవాలని రామోజీరావు ప్రయత్నిస్తున్నారు. కేసులో కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే ప్రతివాదిగా చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌ను కూడా చేయాలన్న మా విజ్ఞప్తిని న్యాయస్థానం స్వీకరించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే వారు రూ.2300 కోట్ల వసూలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో సవాలు చేశాము. నేను ఊహించిన దానికంటే సుప్రీంకోర్టు మంచి ఉత్తర్వులు ఇచ్చింది’ అని ఉండవల్లి, సీనియర్ అడ్వకేట్ ఎస్ఎస్ ప్రసాద్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
నిజమని తేలితే జైలుకే..!
అయితే.. ఈ కేసు వ్యవహారంలో రామోజీ దోషిగా తేలితే మాత్రం రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు భారీ జరిమానా విధించడంతో పాటు.. వసూలు చేసిన దానికి రెండున్నర రెట్లు జరిమాన (సుమారు 7 వేలకోట్లు) విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ జరిమానాతో పాటు రెండున్నరేళ్ల పాటు జైలు శిక్ష పడే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. తదుపరి విచారణలో ఏం జరుగుతుందో ఏమో అని..? న్యాయస్థానం తీర్పుపై తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments