Undavalli: వైసీపీ ఎమ్మెల్యేల మార్పుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Saturday,December 23 2023]

ఏపీలో ఎన్నికలు సమయం ఆసన్నం కావడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే ఇంఛార్జ్‌ల మార్పుతో కదనరంగంలోకి దిగగా.. టీడీపీ-జనసేన కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో రాష్ట్ర తాజా రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ భారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయాల్లో త్యాగాలు చేయడానికి ఎవరూ రారని.. అలాంటిది గెలిచిన ఎమ్మెల్యేలకు సీటు లేదని చెబితే ఎలా అని ప్రశ్నించారు.

సీట్లు మార్చడానికి నాయకుడికి చాలా అనుభవం ఉండాలని.. అలాంటి అనుభవం జగన్‌కు లేదన్నారు. టికెట్లు మార్చే ప్రక్రియ సరికాదని.. తెలంగాణలో టికెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయారని.. ఇక్కడ మార్చితే జగన్ గెలుస్తారని అనుకోవడం కూడా సరికాదని ఆయన స్పష్టంచేశారు. అసలు రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదని.. అధికారమంతా జగన్, వాలంటీర్ల చేతుల్లో మాత్రమే ఉందని ఆరోపించారు. భారీగా అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచడం దేశంలో ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు.

అలాగే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీపైనా ఉండవల్లి స్పందిస్తూ.. జేడీ తన పార్టీ ద్వారా సీట్లు సాధించకపోవచ్చు కానీ ఓట్లు ఎన్ని రాబడతారనే దానిపై రాజకీయ పరిణామాల మారడానికి అవకాశం ఉందని తెలిపారు. చంద్రబాబు, జగన్, ఇతర నాయకులకు నిజాయితీగా పార్టీని నడపడం రాక కాదని.. ప్రయోజనం ఉండలేకే అలా పార్టీలను నడపడం లేదని చెప్పారు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడం వారికే బలమే అవుతుందన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీలోనూ కచ్చితంగా కనపడుతుందని ఉండవల్లి వెల్లడించారు.