‘డేటాచోరీ’ కేసులో యూఐడీఏఐ కీలక ప్రకటన.. వాట్ నెక్స్ట్

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

తెలుగు రాష్ట్రాల్లోనే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'డేటాచోరీ' కేసులో భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక ప్రకటన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7.82 కోట్ల మంది ఆధార్ డేటా చోరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో గురువారం ఆధార్ సంస్థ ఎట్టకేలకు స్పందించింది. ఈ కేసుకు సంబంధించి తమ సర్వర్లలోకి అక్రమంగా చొరబడినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది.

తమ 'సెంట్రల్‌ ఐడెంటిటీస్‌ డేటా రిపాజిటరీ' (సీఐడీఆర్‌), సర్వర్లు పూర్తి సురక్షితంగా ఉన్నాయని ఆధార్ సంస్థ ప్రకటించడం గమనార్హం. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో పోలీసులు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌‌కు సిట్ అధికారులు పంపారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని సిట్ అధికారులు తేల్చిచెప్పిన విషయం విదితమే.

ఆధారాలు చూపని సిట్..
అయితే.. ఇంతలో ఏం జరిగిందో ఏమోగానీ యూఐడీఏఐ.. సీఐడీఆర్‌లోకి అక్రమంగా ఎవరూ అనుసంధానం కాలేదని, సర్వర్ల నుంచి ఎలాంటి డేటా అపహరణకు గురికాలేదని తెలిపింది. ప్రజల ఆధార్‌ నెంబర్లు, పేర్లు, చిరునామా తదితరాలను యూఐడీఏఐ సర్వర్ల నుంచి చోరీ చేశారనడానికి.. ఐటీ గ్రిడ్స్ కేసు విచారణ జరుపుతున్న సిట్‌ ఎలాంటి ఆధారాలను గుర్తించలేదని పేర్కొంది. అయితే, వివిధ సేవలు అందించే సర్వీసు ప్రొవైడర్లే వినియోగదారుల నుంచి నేరుగా ఆధార్‌ సంఖ్య, ఇతర వివరాలను సేకరిస్తాయి.

ఆధార్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాల ప్రకారం ఈ సమాచారాన్ని నిర్దేశిత అవసరం కోసమే సర్వీసు ప్రొవైడర్లు ఉపయోగించాలి.. కానీ, వినియోగదారుల అనుమతి లేకుండా ఇతరులతో ఈ వివరాలను పంచుకోకూడదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి ఆధార్‌ సంఖ్యలను సేకరించడం, వాటిని నిల్వచేయడం, వినియోగించడం, ఇతరులతో పంచుకోవడం చేస్తే ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.

యూఐడీఏఐ అసలేం తేల్చింది...

ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ప్రజల నుంచి ఆధార్‌ సంఖ్యలను సేకరించి, నిల్వ చేయడానికి కారణాలపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులు మమ్మల్ని కోరారు. ఆధార్‌ చట్టంలోని ఏవైనా నిబంధనలను ఉల్లంఘించారా? అనేది కూడా పరిశీలించాలని కోరడం జరిగింది. ఈ ఘటనతో యూఐడీఏఐ డేటా, సర్వర్లకు ఎలాంటి సంబంధంలేదని మేం స్పష్టంగా చెప్పాం. పైగా ఒక వ్యక్తి ఆధార్‌ సంఖ్య బయటకు తెలియడం వల్ల అతడికి ఎలాంటి ముప్పు ఉండదు.

బయోమెట్రిక్‌ లేదా వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ వంటి రెండో అంచె భద్రత ఉంటుంది. ఐటీ గ్రిడ్స్‌ కేసుకు సంబంధించి మా సర్వర్లతో, సమాచారంతో ఎలాంటి సంబంధం లేదు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఆధార్‌ సమాచారాన్ని ఏ అవసరం కోసం సేకరించింది, చట్ట ఉల్లంఘన జరిగిందా? అనే విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం అని యూఐడీఏఐ స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారం తెలంగాణ పోలీసులు, సిట్ అధికారులు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే మరి.