సీఎంగా ఉద్ధవ్ ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
- IndiaGlitz, [Tuesday,November 26 2019]
మహారాష్ట్ర రాజకీయాల్లో గత నెలరోజులుగా నెలకొన్న రాజకీయ పరిణామాలకు సుప్రీం కోర్టు చెక్ పెట్టడంతో.. చేసేదేమీ లేక.. ఏం చేయాలో పాలుపోక ముఖ్యమంత్రి పదవికి సరిగ్గా 78 గంటలు కూడా పూర్తవ్వక మునుపే ఫడ్నవిస్ రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు మళ్లీ శివసేన క్రీజులోకి వచ్చి చక్రం తిప్పుతోంది. రేపు అనగా బుధవారం ఉదయం 8గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశం కానుంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆదేశించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రేను.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు. డిప్యూటీ సీఎం పదవిని ఎన్సీపీ, కాంగ్రెస్ పంచుకోనుంది. రెండున్నరేళ్ల చొప్పున ఉపముఖ్యమంత్రి పదవిలో జయంత్ పాటిల్ (ఎన్సీపీ), బాలా సాహెబ్ (కాంగ్రెస్) కొనసాగనున్నారు. కాగా.. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కాళిదాస్ కొలంబ్కర్ వ్యవహరించనున్నారు.
ఇదిలా ఉంటే.. డిసెంబర్ 1న మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై శివాజీ పార్కులో ఉద్దవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ట్రైండెట్ హాటల్‌లో శివసేన కూటమి భేటీ అయ్యింది. కూటమి నేతగా ఉద్ధవ్ థాక్రేను మిగిలిన సభ్యులు ఎన్నుకున్నారు. భేటీ అనంతరం గవర్నర్‌ను సేన కూటమి కలవనుంది. మొత్తానికి చూస్తే మహారాష్ట్ర ‘మహా’ నాటకమే చోటుచేసుకుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఉద్ధవ్ థాక్రే అనుకున్నది సాధించుకున్నారు.