సమంత.. అక్కినేని వారింటి కోడలైన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తుంది. అది కూడా వరుస విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతుంది. పెర్ఫామెన్స్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్న సమంత తొలిసారి లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించిన చిత్రం `యూ టర్న్`. కన్నడలో విజయవంతమైన `యూ టర్న్` చిత్రాన్నే తెలుగు, తమిళ రీమేక్ చేశారు. కన్నడంలో శ్రద్ధా శ్రీనాథ్ పాత్రను ఇక్కడ సమంత పోషించింది. ఇదొక హారర్ సస్పన్స్ థ్రిల్లర్. స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న సమంతకు `యూ టర్న్` ఎలాంటి సక్సెస్‌ను ఇచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సమంత నటించడానికి ఈ చిత్రం ఎంత వరకు దోహదపడింది? అసలు ఈ చిత్రం ద్వారా ఏం చెప్పాలనుకున్నారు? అనే విషయాలను తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
రచన(సమంత) టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్టర్‌గా జాయిన్ అవుతుంది. ఆర్.కె.పురం ఫ్లై ఓవర్‌పై యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. వాటిపై ఓ కథనం రాయాలనుకుంటుంది. అందులో భాగంగా అక్కడకు వెళ్లి వాహనదారులను గమనిస్తుంది. అందులో ఒకచోట కొందరు యూ టర్న్ తీసుకుంటూ ఉంటారు. అలా ఎంత మంది యూ టర్న్ తీసుకున్నారో వాళ్ల నెంబర్స్ కలెక్ట్ చేస్తుంది రచన. అందులో సుందరం అనే వ్యక్తి దగ్గరకు ఇంటర్వ్యూ చేయడానికి వెళుతుంది. కానీ అప్పటికే సుందరం చనిపోయి ఉంటాడు. పోలీసులు సుందరాన్ని రచనే చంపిందని అనుమానించి ఎంక్వైరీ మొదలు పెడతారు. ఎస్.ఐ.నాయక్(ఆది పినిశెట్టి) కూడా రచనకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాడు. పోలీసుల ఎంక్వైరీలో షాకింగ్ నిజం తెలుస్తుంది. అదేంటంటే.. ఆర్.కె.పురం ఫ్లై ఓవర్ దగ్గర యూ టర్న్ తీసుకునే వాళ్లందరూ చనిపోతూ ఉంటారు. అసలు అందరూ ఎందుకు చనిపోతుంటారు. ఎవరైనా హత్యలు చేస్తున్నారా? లేక వారే ఆత్మహత్యలు చేసుకుంటారా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
- సమంత
- స్క్రీన్‌ప్లే
- నేపథ్య సంగీతం
- కెమెరా వర్క్
మైనస్ పాయింట్స్:
- సినిమా అక్కడక్కడా స్లో కావడం
- కామెడీ సినిమాలు, కమర్షియల్ సినిమాలు ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.
విశ్లేషణ:
స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత ప్రారంభంలో గ్లామర్ రోల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చిన ఇప్పుడు పెర్ఫామెన్స్ పాత్రలు చేయడానికే ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. రంగస్థలం, అభిమన్యుడు, మహానటి.. ఇప్పుడు యూటర్న్ ఇవన్నీ ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలే. ఇక సోలో హీరోయిన్‌గా సినిమాను భుజాలపై మోయాలనుకుందేమో యూ టర్న్ కథను ఎంచుకుంది. ఓ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మంచి మెసేజ్ కూడా ఉంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రచనగా సమంత పాత్రను సమర్ధవంతంగా పోషించింది. కొత్త జోనర్ సినిమానే అయినా.. నటిగా వచ్చిన అనుభవంతో సమంత చాలా చక్కగా నటించింది. ఇక ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టి పక్కాగా సూట్ అయ్యాడు. గతంలో ఆది పోలీస్ ఆఫీసర్‌గా వైశాలి చిత్రంలో నటించడంతో ఈ పాత్రను అలవవోకగా చేసేశాడు. తన బాడీ లాంగ్వేజ్ పక్కా పోలీస్ లాగానే సూట్ అయ్యింది. ఇక సమంతతో పనిచేసే మరో జర్నలిస్ట్ ఆదిత్య పాత్రలో రాహుల్ రవీంద్రన్ పాత్రకు న్యాయం చేశాడు. ఈ ఇద్దరి లవ్ ట్రాక్‌కు స్కోప్ లేదు. ఇక భూమిక పాత్ర పరిమితమే అయినా తన నటనతో పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే.. దర్శకుడు పవన్‌కుమార్ ఏదో సస్పెన్స్ థ్రిల్లర్‌ను చేసి ఆకట్టుకుందాం అనే ప్రయత్నంతో కాకుండా నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలకు కారణమైన రాంగ్ రూట్ డ్రైవింగ్, యూ టర్న్ ఠక్కున తీసేసుకోవడం.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వంటి విషయాలను ఇందులో చివరల్లో చక్కగా స్పృశించాడు. సన్నివేశాలను ఆసక్తికరంగా రాసుకుని ప్రేక్షకులను ఇలాంటి పాయింట్‌తో ఎంగేజ్ చేయడం అంత చిన్న విషయం కాదు. ఈ విషయంలో దర్శకుడు పవన్ సక్సెస్ అయ్యారు. పూర్ణ చంద్ర తేజస్వి నేపథ్య సంగీతం.. అలాగే నికేత్ బొమ్మి కెమెరా పనితం సినిమాకు మెయిన్ ఎసెట్స్ అయ్యాయి.
బోటమ్ లైన్: 'యూ టర్న్'.. మంచి మెసేజ్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్
Comments