'యు-టర్న్' అతిథులెవ‌రంటే..

  • IndiaGlitz, [Thursday,January 25 2018]

2016లో కన్నడంలో వచ్చిన 'యు-టర్న్' సినిమాని.. తెలుగు, తమిళ భాషల్లో అదే పేరుతో అందాల తార‌ సమంత క‌థానాయిక‌గా పునఃనిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. కన్నడంలో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన విలేకరి పాత్రని ఈ రెండు భాషల్లో సమంత పోషించనున్నారు.

బెంగుళూరులో ఒక వంతెన పైన జ‌రిగిన‌ ద్విచక్రవాహన చోదకుల వరుస హత్యల ఉదంతం చుట్టూ తిరిగే ఈ కథని... మాతృకకి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ రెండు భాషల్లో కూడా తెరకెక్కించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఆది పినిశెట్టి ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండగా...సమంత బాయ్‌ఫ్రెండ్‌గా రాహుల్ రవీంద్రన్ నటించనున్నారని తెలుస్తోంది.

ఇక వీరితో పాటు సీనియర్ నాయికలు శ్రియ, భూమిక కూడా ముఖ్య పాత్రల్లో మెరవనున్నారని ఇన్‌సైడ్ సోర్స్ టాక్. ఫిబ్రవరి ఆఖరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై రెండు భాషల్లోనూ నిర్మిస్తున్నారు.