కేసీఆర్ కేబినెట్లో ఇద్దరు మహిళలకు అవకాశం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ కేబినెట్ మొదటి విస్తరణ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విస్తరణలో మహిళా ఎమ్మెల్యేలకే కాదు సొంత ఇంట్లోని వారికి కూడా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అవకాశం కల్పించలేదు. దీంతో ‘ఆమె’కు కేసీఆర్ మరోసారి అన్యాయం చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అటు ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లవెత్తాయి. అంతేకాదు శుక్రవారం నాడు అసెంబ్లీ వేదికగా సభ్యులందరి ముందు మహిళలకు కేబినెట్లో ఎందుకు చోటు కల్పించలేదు..? అని సీఎంను.. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
ఇందుకు స్పందించిన కేసీఆర్.. త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రకటించారు. మొత్తం ఆరుగురిని తీసుకుంటున్నాని.. వారిలో ఇద్దరు మహిళలు ఉంటారని గులాబీ బాస్ స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడం వల్లనే తమ పార్టీ అధికారం నిలబెట్టుకుందని, వారిని విస్మరించే ఛాన్సే లేదని స్పష్టం చేశారు. గత కేబినెట్లో మహిళలను తీసుకోకపోవడానికి ప్రత్యేక కారణాలేమీ లేవని పేర్కొన్నారు. సో మొత్తానికి చూస్తే ఆడపడుచులకు కేబినెట్లో అవకాశం ఇవ్వలేదు అనే అపవాదును కేసీఆర్ త్వరలోనే చెరుపుకోబోతున్నారన్న మాట.
ఇంతకీ ఆ ఇద్దరు అదృష్టవంతులెవరు..!?
కేసీఆర్ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలను కేబినెట్లో తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు..? ఎమ్మెల్యేలుగా పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, గొంగిడి సునీతలలో ఎవర్ని కేబినెట్లోకి తీసుకోబోతున్నారు..? ఇంతకీ కేసీఆర్ కేబినెట్లోకి ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరు..? అని ఏ ఇద్దరు కలుసుకున్నా రాష్ట్రంలో ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. పద్మాదేవేందర్ రెడ్డి, రేఖా నాయక్‌ను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout