వారం గ్యాప్‌లో రెండు సోల్జ‌ర్ చిత్రాలు

  • IndiaGlitz, [Wednesday,April 25 2018]

దేశం కోసం ప్రాణత్యాగం చేయ‌డానికి కూడా వెనుకాడ‌ని ఆర్మీ ఆఫీస‌ర్ల క‌థ‌ల‌తో గ‌తంలో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. ఆద‌ర‌ణ పొందాయి. ఈ ఏడాదిలో కూడా అలాంటి సినిమాలు తెర‌పైకి రానున్నాయి. అయితే ఓ రెండు చిత్రాలు మాత్రం.. కేవ‌లం వారం గ్యాప్‌లో సంద‌డి చేయ‌నుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. ఆ చిత్రాలే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మెహ‌బూబా. యారోగెంట్ ఆర్మీ అధికారిగా అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ద్వారా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

మే 4న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. క‌ట్ చేస్తే.. స‌రిగ్గా వారం త‌రువాత అంటే మే 11న మెహ‌బూబా రానుంది. 1971 ఇండో-పాక్ వార్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాలో సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు పార్శ్యాలున్న పాత్ర‌లో యువ క‌థానాయ‌కుడు పూరీ ఆకాష్ న‌టించాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ద్వారా నేహా శెట్టి క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానుంది. మ‌రి.. వారం రోజుల గ్యాప్‌లో వ‌స్తున్న ఈ సైనికుల్లో ఎవ‌రు ఆక‌ట్టుకుంటారో వేచి చూడాలి.