డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. తెలంగాణలో రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు, వివరాలివే

  • IndiaGlitz, [Tuesday,February 08 2022]

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాదక ద్రవ్యాలపై కీలక సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. గత నెల 28 వ తేదీ ప్రగతిభవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరిపారు. సీఎం కేసిఆర్ అద్యక్షతన రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సిఎస్, డిజిపి, డిజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డిసిపీ అధికారులు వారితో పాటు రాష్ట్ర ఎక్సైజ్, పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు. అలాగే రైతులు ఎవరైనా పొలాల్లో గంజాయి సాగు చేస్తే దళిత బంధును కట్ చేస్తామని హెచ్చరించారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే కొందరు రైతులను దళిత బంధు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు అధికారులు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో డ్రగ్స్ నిర్మూలన కోసం రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్‌ సీపీ కార్యాలయం కేంద్రంగా ఈ రెండు విభాగాలు కార్యకలాపాలు సాగించనున్నాయి. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ , నార్కోటిక్స్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌ విజన్‌ వింగ్ పేరిట వీటిని ఏర్పాటు చేశారు. నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో డీసీపీ స్థాయి అధికారి, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్‌ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు. ఇక నార్కోటిక్స్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌ విజన్‌ వింగ్‌లో ఒక ఏసీపీ, ఒక ఇన్‌స్పెక్టర్‌, ఒక ఎస్‌ఐ, ఆరుగురు కానిస్టేబుళ్లు పనిచేస్తారు. బుధవారం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఈ రెండు విభాగాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు.