ఒకే లైన్‌తో రెండు సినిమాలు?

  • IndiaGlitz, [Wednesday,April 11 2018]

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చేతిలోకి వచ్చేసింది. ఏది కావాలన్నా ఒక్క క్లిక్‌తో క్షణాల్లో కళ్ళ ముందు వాలిపోతుంది. ఈ సౌకర్యాన్ని కొంతమంది సినీ దర్శకులు బాగానే వినియోగించుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో సినిమాలు చూసి.. నచ్చిన లైన్‌తో కథను రెడీ చేసేస్తున్నారు. ఒక్కోసారి ఒకే లైన్‌ను ఇద్దరు, ముగ్గురు ద‌ర్శ‌కులు ఎవ‌రికి నచ్చిన విధంగా వారు మ‌ల‌చుకుని మ‌రీ కథను సిద్ధం చేసుకుంటూ ఉంటారు.  ప్ర‌స్తుతం సెట్స్ పైనున్న రెండు సినిమాలు ఇలా ఒకే లైన్‌తో తెర‌కెక్కుతున్నాయ‌ని తెలిసింది.

కాస్త‌ వివరాల్లోకి వెళితే.. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచె మనసు’, కరుణాకరన్ డైరెక్షన్‌లో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా  తెర‌కెక్కుతున్న‌ సినిమాల‌కు సంబంధించి..  స్టోరీ లైన్ ఒక‌టే అనే విషయం పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ప్రేమకథలుగా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాల్లో కూడా.. హీరోయిన్స్‌కి షార్ట్ టైం మెమరీ లాస్ సమస్య ఉంటుందని సమాచారం. మరి ఈ లైన్‌ను నిజంగానే ఏదైనా సినిమా నుంచి కాపీ చేసారా? లేదా సొంతంగానే ఇద్దరు దర్శకులకి ఒకే రకమైన కథ స్ఫురించిందా? అనేది తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.