అర్థరాత్రి రోడ్డు ప్రమాదాలు.. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు ఎమ్మెల్యేలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman), ఏపీలోని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi)ప్రయాణిస్తున్న కార్లు ప్రమాదానికి గురయ్యారు. ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కావడంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్‌లో పనులు ముగించుకుని ఆదివారం అర్థరాత్రి తన కాన్వాయ్‌తో ధర్మపురి బయలుదేరారు. అయితే జగిత్యాల జిల్లా ఎండపల్లి అంబారిపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సహచరులు స్పల్ప గాయాలతో బోల్తాపడ్డారు. సీటు బెల్టు పెట్టుకోవడం కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పంది. లక్ష్మణ్ తలకు గాయం కాగా వెంటనే మరో వాహనంలో కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అయితే ఆయన క్షేమంగానే ఉన్నారని ఒకటి, రెండు రోజుల్లో ఆసుప్రతి నుంచి డిశ్చార్జి అవుతారని కార్యకర్తలకు నచ్చచెప్పి పంపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలోని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రయాణిస్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. ఆదివారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఆయన తన కాన్వాయ్‌తో బయలుదేరారు. సూర్యపేట వద్దకు రాగానే ఆయన కారు అదుపుతప్పింది. వెంటనే కారులోని ఎయిర్‌బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో వెంటనే మరో కారులో హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎలాంటి గాయాలు కాలేదని తాను క్షేమంగానే ఉన్నానని.. కార్యకర్తలు ఆందోళనపడాల్సిన అవసరం లేదని గొట్టిపాటి తెలిపారు. కాగా అదృష్టవశాత్తూ రెండు రోడ్డు ప్రమాదాల్లోనూ నేతలు ఇద్దరు సీటు బెల్టు పెట్టుకోవడంతో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో ఇరు నేతల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
అందుకే కారులో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరు సీటు బెల్టు పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తూ ఉంటారు. అలాగే నేతలు వాడే కార్లు హైఎండ్ వాహనాలు కావడంతో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అయి వారిని ప్రాణాపాయస్థితి నుంచి బయటపడేశాయని చెబుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout