కేజిన్నర బంగారంతో వెళుతుండగా ప్రమాదం.. ఇద్దరి మృతి
- IndiaGlitz, [Tuesday,February 23 2021]
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మాల్యాలపల్లి రైల్వేబ్రిడ్జ్ మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 సిబ్బంది.. కారు వద్దకు వచ్చి చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అసలు విషయంలోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబు, సంతోష్, డ్రైవర్ సంతోష్ కుమార్ బంగారం వ్యాపారం చేస్తున్నారు. వీరంతా బంగారం అమ్మేందుకు కారులో రామగుండం మీదుగా మంచిర్యాల, బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాలను రామగుండం ఏరియా ఆసుపత్రికి తరలించి.. క్షతగాత్రులను కరీంనగర్‌కు తరలించారు.
ఈ ప్రమాదంలో శ్రీనివాస్, రాంబాబులు మృతి చెందగా.. సంతోష్, డ్రైవర్ సంతోష్ కుమార్ తీవ్ర గాయాల పాలయ్యారు. అనంతరం డిక్కీ ఓపెన్ చేయగా.. డిక్కీలో ఉన్న మూడు బ్యాగులు ఓపెన్ చేయగా పదుల సంఖ్యలో ప్యాకిట్ బుక్స్ లభ్యం అయ్యాయి. వాటిని 108 సిబ్బంది పోలీసులకు అప్పగించింది. బంగారం కిలోన్నర వరకూ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.