వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరి మృతి.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన
- IndiaGlitz, [Tuesday,January 19 2021]
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో కూడా వ్యాక్సిన్ అనంతర మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా.. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. అయితే ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అపోహలు పెరగకుండా వారి మరణాలకు కారణాలను కేంద్రం వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఒకరు, కర్ణాటకకు చెందిన మరొకరు మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెంటనే వారి మరణాలకు కారణాలను అన్వేషించడం ప్రారంభించింది.
అయితే ఉత్తరప్రదేశ్‌లో వ్యక్తి మృతికి వ్యాక్సిన్ తీసుకోవడం కారణం కాదని స్పష్టమైందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. యూపీలోని మొరాదాబాద్‌లో చనిపోయిన వ్యక్తి వయసు 52 సంవత్సరాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది అతనికి 16వ తేదీన వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని.. 17వ తేదీ సాయంత్రం ఆ వ్యక్తి మృతి చెందాడని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ వ్యక్తి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన ముగ్గురు వైద్యులు అతని మరణానికి కారణం హృద్రోగ సమస్య అని తేల్చారని పేర్కొంది. ఇక కర్ణాటకలోని బళ్లారిలో మరో వ్యక్తి చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కర్ణాటకలోని బళ్లారిలో చనిపోయిన వ్యక్తికి జనవరి 16న వ్యాక్సిన్ ఇచ్చారని, జనవరి 18న అతను మృతి చెందాడని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ వ్యక్తి మృతదేహానికి బళ్లారిలోని విజయనగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మంగళవారం పోస్ట్‌మార్టం చేయాలని భావించినట్లు తెలిపింది. కాగా.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ సత్ఫలితాలనే ఇచ్చింది. పెద్దగా అనూహ్య ఘటనలేమీ జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకరిద్దరు అస్వస్థతకు గురవడం మినహా ఇతర ఇబ్బందికర పరిణామాలైతే సంభవించలేదు.