Helicopters:గాలిలో రెండు ఆర్మీ హెలికాఫ్టర్లు ఢీ.. 10 మంది దుర్మరణం..
Send us your feedback to audioarticles@vaarta.com
రెండు ఆర్మీ హెలికాఫ్టర్లు గాలిలోనే పరస్పరం ఢీకొన్న ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది సిబ్బంది చనిపోయారు. ఈనెల 26న మలేషియాలో రాయల్ మలేషియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా పెరక్‌లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం ఉదయం రిహార్సల్స్ నిర్వహించారు. శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్ సితియావాన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్దిసేపటికే గగనతలంలో ప్రమాదవశాత్తు ఢీకొని కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు ఉన్నారు.
ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్లను అగస్టా వెస్ట్‌ల్యాండ్ AW 139 మారిటైమ్ ఆపరేషన్ హెలికాప్టర్, యూరోకాప్టర్ ఫెన్నెక్‌గా అధికారులు ధ్రువీకరించారు. రెండు విమానాలు ఢీకొనడానికి ముందు సుమారు ఉదయం 9.03 గంటలకు పడంగ్ సితియావాన్ నుంచి బయలుదేరినట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొ్న్నారు. ఇందులో ఓ హెలికాఫ్టర్ ప్రమాదం జరిగిన స్థలం పక్కనే ఉన్న స్టేడియంలో పడిపోగా.. మరో హెలికాఫ్టర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా ఇటీవల జపాన్‌లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. గత శనివారం అర్ధరాత్రి ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్లిన రెండు నౌకదళ హెలికాప్టర్లు గగనతలంలోనే ఢీకొని సముద్రంలో కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు గల్లంతయ్యారు. అయితే ఇప్పటివరకూ గల్లంతైన వారి ఆచూకీ తెలియరాలేదు. మరోవైపు మలేషియాలో సైన్యానికి చెందిన హెలికాప్టర్ ప్రమాదం జరగడం రెండు నెలల్లో ఇది మూడోది. మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ గత నెలలో రెస్క్యూ డ్రిల్‌లు నిర్వహిస్తుండగా సెలంగోర్‌లోని పులావ్ అంగ్సా సమీపంలోని జలాల్లో సైనిక హెలికాప్టర్ కూలిపోయింది. అంతకు ముందు ఫిబ్రవరిలో తేలికపాటి యుద్ధ విమానం కూలిన ఘటనలో పైలట్ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments