బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల వ్యవహారంలో ట్విస్ట్

  • IndiaGlitz, [Tuesday,January 16 2024]

లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)కేసులో రోజుకొక కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. విచారణను వేగంవంతం చేసిన ఈడీ అధికారులు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు సమన్లు జారీ చేశారు. ఇవాళ అంటే జనవరి 16న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఈడీ నోటీసులు అందుకున్న కవిత తాను విచారణకు హాజరుకావడం లేదంటూ సమాధానమిచ్చారు. ఈ మేరకు అధికారులకు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో తన విచారణ కేసు పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. ఆ తీర్పు వచ్చే వరకు విచారణకు హాజరు కానని స్పష్టంచేశారు.

అయితే ఈడీ అధికారులు మాత్రం ఇందుకు అనుమతి ఇవ్వలేదని.. విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒకవేళ విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బీఆర్ఎస్ కార్యకర్తలు టెన్షన్‌ పడుతున్నారు. గతేడాది మార్చిలో కవితను మూడు సార్లు అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణకు సహకరించిన కవిత.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో ఆమె వినియోగించిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సైతం వారికి అప్పగించారు.

అప్పుడు రోజుకు దాదాపు 10 గంటలకు పైగా కవితను విచారించారు. అంతసేపు విచారించడంతో ఆమె అరెస్ట్ ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కేవలం విచారణ మాత్రమే చేశారు. తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఓ మహిళను గంటలు గంటలు విచారిస్తున్నారని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గతేడాది నవంబర్ వరకు ఆమెను విచారణకు పిలవొద్దని ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆ విచారణ కోర్టులో పెండింగ్‌లో ఉంది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. జనవరి 18న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఆయనకు నాలుగు సార్లు సమన్లు ఇచ్చినట్లు అయింది. అయినా కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయన అరెస్ట్ ఖాయం అని ఢిల్లీ సర్కిల్‌లో వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో కవితకు ఉన్న పళంగా నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అయితే విచారణకు హాజరుకావడం లేదంటూ ఆమె లేఖ రాయడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.