ముదురుతోన్న 'ప్రాంక్' వివాదం: మంత్రి తలసాని వద్దకు పంచాయతీ, విశ్వక్‌సేన్‌పై టీవీ9 యాంకర్ ఫిర్యాదు

సినిమా ప్రమోషన్ కోసం యువ హీరో విశ్వక్ సేన్ అండ్ టీం చేయించిన ఫ్రాంక్ వీడియో చివరికి అతని మెడకు చుట్టుకుంది. నడిరోడ్డుపై పబ్లిక్‌ను డిస్ట్రబ్ చేసేలా న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ విశ్వక్ సేన్‌పై అరుణ్ కుమార్ అనే న్యాయవాది తెలంగాణ మానవహక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ 9 నిర్వహించిన డిబేట్ రసాభాసగా మారింది. చర్చ జరుగుతున్న సమయంలో ఆకస్మాత్తుగా స్టూడియోలోకి దూసుకొచ్చిన విశ్వక్ సేన్.. నన్ను డిప్రెషన్ పర్సన్ , పాగల్ సేన్ అనడానికి మీరెవరంటూ యాంకర్ దేవి నాగవల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది.

మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి అంటూ యాంకర్‌ను హెచ్చరించారు విశ్వక్ సేన్. ఆ మాటలకు దేవి నాగవల్లి ఫైరయ్యింది. ‘‘యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో’’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానికి భగ్గుమన్న విశ్వక్ సేన్ ‘యు ఫ** గయ్స్ కాల్డ్ మీ’’’ అంటూ లేడీ యాంక‌ర్‌పై విరుచుకుప‌డ్డాడు. దీంతో స‌హ‌నం కోల్పోయిన యాంకర్ ‘యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో’ అంటూ అదే పనిగా చెప్పడంతో విశ్వక్ సేన్ స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోయారు. తొలుత అంతా దీనిని మరో ఫ్రాంక్ వీడియో అన్నట్లుగా భావించారు. కానీ ఇది నిజంగానే జరిగిందని.. కావాలని చేసినది కాదని తేలింది.

తనను తీవ్ర దుర్భాషలాడటం, లైవ్‌లో అసభ్య పదజాలంతో దూషించడాన్ని సీరియస్‌గా తీసుకున్న యాంకర్ దేవి నాగవల్లి .. హీరో విశ్వక్ సేన్‌పై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దేవి వెంట జర్నలిస్ట్ ఫోరం సభ్యులు కూడా ఉన్నారు. దీనిపై మంత్రి తలసాని స్పందించారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓ సినిమా గురించి ప్రమోషన్స్ నిర్వహించుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రాంక్ వీడియోల పేరిట రోడ్లపై ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, దీనిపై తాను పోలీసు అధికారులతో మాట్లాడతానని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

లైవ్ డిబేట్‌లో యాంకర్ దేవి నాగవల్లి, హీరో విశ్వక్‌సేన్ మధ్య జరిగిన వాగ్వాదాన్ని తాను చూశానని మంత్రి తలసాని తెలిపారు. ఈ తరహా ప్రవర్తనను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మన కుటుంబాల్లోనూ ఆడవాళ్లు ఉంటారని, ఓ ఆడకూతుర్ని ఈ విధంగా అవమానించడం సబబు కాదని తలసాని హితవు పలికారు. ఈ అంశంలో ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ తరఫు నుంచి తీసుకోవాల్సిన చర్యలు, పోలీసు శాఖ నుంచి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడతానని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.