Tula Uma: బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

  • IndiaGlitz, [Monday,November 13 2023]

నాలుగు రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది. బీజేపీకి రాజీనామా చేసిన తుల ఉమ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి.. బీఫాం ఇవ్వకుండా ఇచ్చిన సీటును గుంజుకోవడం చాలా బాధాకరమని మండిపడ్డారు. బీసీల పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరికి ఇది నిదర్శనమన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రగల్భాలు పలికిన కమలం పెద్దలు తుల ఉమను అవమానించారన్నారు. నాడు కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలిగా ఉమక్క పనిచేశారన్నారు. కేసీఆర్ సూచన మేరకు ఆమెకు పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ఆమెకు గతంలో ఉన్న హోదా కంటే సముచిత బాధ్యతలను అప్పగిస్తామని హామీ ఇచ్చారు.

బీసీ వ్యక్తిని బీజేపీ సీఎం చేసేది ఓ కల మాత్రమే అని.. ఆ పార్టీ అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతుందని తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి దొంగ దారిన ఇంకొకరికి కేటాయించారని మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు అనేక హోదాల్లో పని చేశాను అని కానీ బీజేపీలో అలాంటి గౌరవం దక్కలేదని వాపోయారు. ఇప్పుడు సొంత గూటికి వచ్చినట్లు ఉందని ఆమె తెలిపారు.

కాగా అంతకుముందు బీజేపీకి రాజీనామా చేసిన లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపిచారు. ఈ సందర్భంగా ఆమె పార్టీపై పలు విమర్శలు చేశారు. 'బీజేపీలో చేరిన నాటి నుంచి పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశాను. పార్టీకి చేసిన సేవను గుర్తించి నన్ను వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ చివరి నిమిషంలో బీఫామ్‌ వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను అవమానించారు. ఇది నా ఒక్కదానికి జరిగిన అవమానం కాదు. నా గొల్ల కురుమ జాతికి జరిగిన అన్యాయం. యావత్‌ తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమల ఆగ్రహానికి మీ నిర్ణయం కారణమైంది. పార్టీకి ఎంతో నిబద్ధతతో పని చేసే కార్యకర్తలు ఉన్నారు. వాళ్లందరి ఉత్సాహాన్ని మీ తప్పుడు నిర్ణయాలతో నీరుగారుస్తున్నారు. నాతో పాటు ఎందరో బీసీ నాయకులకు మీరు అన్యాయం చేస్తున్నారు. అసలు బీఫామ్‌లే సరిగా ఇవ్వలేని మీరు బీసీ నినాదంతో ముందుకు పోతామని అనడం విడ్డూరంగా ఉంది.' అని లేఖలో పేర్కొన్నారు.