Tirumala Rush: పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 48 గంటలు, ఇప్పట్లో తిరుమల రావొద్దన్న టీటీడీ

  • IndiaGlitz, [Sunday,May 29 2022]

తిరుమల శనివారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్మెంట్స్ నిండిపోయి... క్యూ కాంప్లెక్స్ వెలుపలకు బారులు తీరారు భక్తులు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామి వారి దర్శనం ఆలస్యమైంది. శనివారం క్యూలోకి వెళ్లిన భక్తులకు 48 గంటలకు పైగా దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నట్లు టీటీడీ సిబ్బంది వెల్లడించారు. వారాంతం కావడం, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పరీక్షలు పూర్తవడంతో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు.

సోమవారం వరకు భక్తుల రద్దీ:

దీంతో తిరుమల కొండపై ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సోమవారం సాయంత్రం వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ రంగంలోకి దిగింది. కొండపై అనూహ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించింది. అదే సమయంలో సాధారణ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీలు సైతం తమ దర్శన ఏర్పాట్లలో మార్పులు చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

ఇప్పట్లో తిరుమల రావొద్దు:

ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం పడుతోందని.. రానున్న నాలుగైదు రోజుల్లో రద్దీ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని టీటీడీ చెబుతోంది. కావున భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోచాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సూచించారు... అలాగే తిరుమలలో రద్దీ దృష్ట్యా మూడు రోజులపాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని, సిఫారసు లేఖలతో వచ్చేవారు గమనించాలని ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.