TTD EO Dharmareddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు.. వచ్చే నెలలో పెళ్లి, అంతలోనే
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (శివ) గుండెపోటుకు గురయ్యారు. ఆయన వయసు 28 సంవత్సరాలు. గుండెపోటుకు గురైన వెంటనే శివను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో చంద్రమౌళికి నిశ్చితార్ధం జరగ్గా.. జనవరిలో వీరి వివాహం జరగాల్సి వుంది.
శుభలేఖలు పంచేందుకు చెన్నైకి :
దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా వుండటంతో పాటు శుభలేఖలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని ఆళ్వారుపేటలో బంధువులకు పెళ్లిపత్రికలు ఇవ్వడానికి ఆదివారం మధ్యాహ్నం ఆయన కారులో నగరానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే గుండెలో నొప్పిగా వుందని కారులోనే వున్న స్నేహితుడితో చెప్పగా... శివను కావేరి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ధర్మారెడ్డి దంపతులు, కాబోయే వియ్యంకుడు శేఖర్ రెడ్డిలు కావేరి ఆసుపత్రికి వెళ్లారు. వీరితో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు కూడా కావేరి ఆసుపత్రికి వెళ్లారు. అయితే కొడుకు పరిస్ధితిని చూడగానే ధర్మారెడ్డి కళ్లు తిరిగి పడిపోవడంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
వైద్యులు ఏమన్నారంటే:
మరోవైపు చంద్రమౌళి ఆరోగ్య పరిస్ధితిపై కావేరి ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనను 18వ తేదీ ఆసుపత్రికి తీసుకొచ్చారని.. అప్పటికే చంద్రమౌళి పరిస్ధితి విషమంగా వుండటంతో సీపీఆర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే క్యాత్‌లాబ్‌కు తరలించి .. ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు కావేరి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిపుణులైన వైద్య బృందం చంద్రమౌళికి చికిత్స అందిస్తోందని.. అత్యంత క్లిష్ట సమయంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని కావేరి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments