శ్రీవారి సమక్షంలో ఇంతటి విషాదమా!.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన..
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుమల శ్రీవారికి నిత్యం సేవలందించే ఓ ఉద్యోగి విషయంలో జరిగిన దారుణం వింటే కన్నీళ్లు తెప్పించక మానదు. కరోనాతో బాధపడుతున్న ఆ ఉద్యోగి కనీసం తన ఐడీ కార్డు చూసి అయినా సరైన వైద్యం అందించకపోతారా? అని చివరి క్షణాల్లో ఆశపడ్డాడు. ఐడీ కార్డు మెడలో వేసుకున్నా ఉపయోగం లేకపోయింది. బతకాలన్న ఆశతో చివరకు పోరాడిన ఆ ఉద్యోగికి చివరకు మరణం కౌగిట్లోకి చేరుకోక తప్పలేదు. టీటీడీ నిధులతో నడిచే ఆ ఆసుపత్రి కనీసం దేవస్ధానానికి చెందిన ఉద్యోగికి వైద్యం అందించకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుపతిలో నివాసముంటున్న వీరాస్వామి అనే వ్యక్తి తిరుమలలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. ఇటీవల తిరుమలకు వెళ్లిన వీరాస్వామి వారం తర్వాత కరోనాతో తిరిగి వచ్చాడు. పరీక్షల్లో కరోనా నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం పద్మావతి ఆసుపత్రిలో చేరాడు. తిరుమలలో సరైన భోజనం అందక వీరాస్వామి చాలా నీరసించి పోయాడు. పైగా పద్మావతి ఆసుపత్రిలో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో తన కుమారుడికి ఫోన్ చేసి తనను వేరే ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని కోరినా తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైద్యం అందుబాటులో లేదని చెప్పాడు. కనీసం తన ఐడీ కార్డు చూసి అయినా సరైన వైద్యం అందిస్తారని వీరాస్వామి ఐడీ కార్డును మెడలో తగిలించుకున్నాడు. అయినా ఫలితం శూన్యం. చివరకు వీరాస్వామిని బతికించుకోవదాలని చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. బతకాలన్న ఆశతో పోరాడి పోరాడి చివరకు వీరాస్వామి కన్నుమూశాడు.
తిరుమలలో తమ పట్ల అడుగడుగునా నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దర్శనాలు ఆపమని కోరుతున్నా టీటీడీ అధికారులు స్పందిచడం లేదు.
ప్రతి నెల కోట్ల రూపాయల టీటీడీ నిధులు తీసుకుంటూ టీటీడీ ఉద్యోగులకు కనీసం కోవిడ్ వైద్యం అందించడంలో వెల్లువెత్తుతున్న నిర్లక్ష్యంపై ఉద్యోగులు ఆ్రగహం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి కొండపై ఉంటున్న తమకు కనీసం ఆహారం, వైద్యం గురించి కూడా పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. వీరాస్వామిని కాపాడాలంటూ టీటీడీ ఉద్యోగులు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా స్విమ్స్ డైరెక్టర్ వెంగమాంబ స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరాస్వామి మరణంతో టీటీడీ ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శ్రీవారి సమక్షంలో ఇంతటి విషాదమేంటని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments