TSRTC:ప్రయాణీలకు అలర్ట్ : హైదరాబాద్ - విజయవాడ హైవేపై పోటెత్తుతోన్న వరద .. టీఎస్ఆర్టీసీ సర్వీసులు బంద్
- IndiaGlitz, [Friday,July 28 2023]
భారీ వర్షాలు , వరదలతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. వందలాది గ్రామాలు జలదిగ్భంధంలో మునిగిపోయి బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ అయ్యాయి. రహదారులు, రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు చేరడంతో ప్రజారవాణా వ్యవస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఏపీ- తెలంగాణ మధ్య ప్రధాన రహదారి అయిన ఎన్‌హెచ్ 65 వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ వుండటంతో అధికారులు వాహనాలను నిలిపివేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపివేయడంతో కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి.
గురువారం సాయంత్రానికి హైవేపైకి భారీ వరద :
ఖమ్మంలో భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో మున్నేరు వాగు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహిస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో గురువారం సాయంత్రం నుంచి వాహన రాకపోకలను నిలిపివేశారు. కీసర టోల్ గేట్ దాటిన తర్వాత ఐతవరం వద్ద హైవేపై నీరు ప్రవహిస్తోంది. అప్పటికే వరదలో చిక్కుకున్న వాహనాలను క్రేన్ సాయంత్రం రక్షించారు పోలీసులు.
రెగ్యులర్ సర్వీసులను రద్దు చేసిన టీఎస్ఆర్టీసీ :
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం రద్దీగా వుండే హైదరాబాద్ - విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీస్‌లను రద్దు చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ‘‘ హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఏపీలోని కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ - విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడుపుతాం. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని.. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరు. మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించగలరు ’’ అని సజ్జనార్ పేర్కొన్నారు.
ప్రయాణికులకు ముఖ్య గమనిక! హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 28, 2023