వైఎస్ జగన్‌తో టిఎస్సార్ భేటీ.. చేరిక ఎప్పుడో..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ సీనియర్ నేత టి. సుబ్బిరామిరెడ్డి భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్ంన కుటుంబ సమేతంగా వెళ్లిన టిఎస్సార్.. జగన్‌ను కలిశారు. సుమారు గంటకు పైగా ఈ భేటీ జరిగింది. అనంతరం ఇరు కుటుంబ సభ్యులూ కలిసి లంచ్ కూడా చేశారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సుబ్బిరామిరెడ్డి ఇందుకు సంబంధించి విషయాలు వెల్లడించారు.

భేటీలో ఏం చర్చించారు!?
‘మా కుటుంబసభ్యులతో పాటు జగన్‌ను కలిశాను. ఇరు కుటుంబసభ్యులం కలిసి లంచ్‌ చేశాం. సమావేశంలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదు. రాజ్యసభ ఎన్నికల అంశం ప్రస్తావనకే రాలేదు. మా అబ్బాయి, కూతురు అల్లుడు ఈ భేటీలో ఉన్నారు’ అని టీఎస్సార్ చెప్పుకొచ్చారు. అయితే ఈ భేటీపై అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

చేరిక ఎప్పుడో..!?
కాగా.. గత కొన్ని రోజులుగా ఓ గన్ షాట్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతోందంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ గన్ షాట్‌ మరెవరో కాదు టిఎస్సారే. అయితే ఆయన ఈ వార్తలు వచ్చిన కొన్నిరోజులకే ఇలా జగన్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి మధ్య ‘చేరిక’ చర్చ జరిగిందని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే జగన్ సమక్షంలో సుబ్బిరామిరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. మరి చేరిక ఎప్పుడో..? ఈ చేరికపై నిజానిజాలెంత అనేది దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.