వేణుమాధవ్ ఆస్పత్రి బిల్లు చెల్లించిన మంత్రి.. ఆర్థికసాయం!
- IndiaGlitz, [Wednesday,September 25 2019]
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నగరంలోని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకోగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
2 లక్షలు ఆర్థిక సాయం!
ఇదిలా ఉంటే.. వేణుమాధవ్ భౌతికకాయాన్ని సందర్శించిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. వేణుమాధవ్ ఆస్పత్రిలో ఉన్నంత వరకూ అయిన బిల్లును మంత్రి తలసానే చెల్లించారు. అంతేకాకుండా ఆర్థిక పరమైన విషయాలను పూర్తి చేశామని మంత్రి తెలిపారు. అంతేకాకుండా అంత్యక్రియలకు కావాల్సిన డబ్బు మొత్తం తానే సాయం చేస్తానని మాటిచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. రూ.2 లక్షలు సాయం ప్రకటించినట్లు సమాచారం.
నాకు తమ్ముడిలాంటోడు!!
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తలసాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేణుమాధవ్‌తో తనకున్న అనుబంధాన్ని తలసాని పంచుకున్నారు. ‘వేణుమాధవ్ నాకు తమ్ముడు లాంటి వాడు. ఇంత చిన్నవయస్సులోనే మరణించడం బాధాకరం. వేణుమాధవ్‌తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఇండస్ట్రీకి రాక ముందు నుంచీ వేణుమాధవ్ నాకు తెలుసు. ఆయన ఎక్కడున్నా అందర్నీ నవ్వించేవాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని టాలెంట్‌తో ఈ స్థాయికి చేరాడు. సుమారు 600 చిత్రాల్లో నటించి.. నంది అవార్డులు దక్కించుకున్నాడు’ అని ఒకింత భావోద్వేగానికి లోనైన ఆయన... వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రేపు అంత్యక్రియలు!
కాగా.. వేణుమాధవ్ పార్థివదేహాన్ని రేపు అనగా.. సెప్టెంబర్ 26న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:30 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం నగరంలోని ఫిలింఛాంబర్ కాంప్లెక్స్ ఆవరణలో ఉంచుతామని.. అనంతరం మౌలాలిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ ఓ ప్రకటనలోతెలిపారు.