హుజూర్‌నగర్‌లో ‘కారు’ గెలుపు ఆషామాషీ కాదు!
- IndiaGlitz, [Thursday,October 24 2019]
తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కలలో కూడా ఊహించని భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,284 వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డ్ బ్రేక్ చేశారు. అయితే ఈ భారీ విజయంపై ఫస్ట్ టైమ్ తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. గురువారం నాడు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఫలితాలు, ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆర్టీసీ పరిస్థితి, పక్క రాష్ట్రాల్లో టీఆర్ఎస్ విస్తరణ లాంటి విషయాలపై సుధీర్ఘంగా మాట్లాడారు.
ఈ గెలుపు ఆషామాషీ గెలుపు కాదు..!
‘ముందుగా హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు అద్భుత విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానను. ఈ గెలుపు ఆషామాషీ గెలుపు కాదు.. ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారు. ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ఈ గెలుపు ఓ టానిక్ లాంటిది.. మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. హుజూర్ నగర్ ఉపఎన్నికలకు ముందు నిర్వహించాల్సిన సభకు నేను హాజరుకాలేకపోయాను. ఇంత అద్భుత విజయాన్ని అందించిన ప్రజల కోసం ఎల్లుండి హుజూర్ నగర్‌లో కృతజ్ఞత సభ నిర్వహిస్తాం’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
బాధ్యత మరింత పెరిగింది..!
‘బీజేపీ పెడబొబ్బలకి.. వాళ్లకు వచ్చిన ఓట్లకు సంబంధం లేదు. బీజేపీకి వచ్చిన ఓట్లు చూస్తే నవ్వాలో..? ఏడవాలో..ఝ వాళ్లకే అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరమేనని.. కానీ లేనిపోని అపనిందలు వేయడం సబబు కాదు. ప్రతిపక్షాలు అహంభావం, అహంకారంతో వ్యవహరించడం సరికాదు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలతో తమపై బాధ్యత మరింత పెరిగింది. మరింత సంస్కారంతో పనిచేయాల్సిందిగా టీఆర్ఎస్ శ్రేణులకు సూచిస్తాం. ప్రతిపక్షాలు ఇకనైనా పంథా మార్చుకోవాలని.. రాజకీయాల కోసం పచ్చి అబద్దాలు చెబుతామంటే కుదరదు’ అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. కాగా ఈ వ్యవహారం ప్రతిపక్ష పార్టీలు ఏ మాత్రం రియాక్ట్ అవుతాయో వేచి చూడాల్సిందే మరి.