Munugode Bypoll : హోరాహోరీ పోరులో టీఆర్ఎస్‌దే విజయం, బీజేపీకి సెకండ్ ప్లేస్, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు

తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11,666 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో పాటు డిపాజిట్ కోల్పోయింది. మునుగోడు ఉపఎన్నికలో విజయం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన మూడు ఉపఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించినట్లయ్యింది. గతంలో హూజూర్‌నగర్, నాగార్జున సాగర్‌లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. అంతేకాదు.. తాజా విజయంతో ఉమ్మడి నల్గొండ జిల్లాను టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 12 నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వున్నారు.

ఫలితాల విడుదలలో గందరగోళం:

అంతకుముందు ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుంచి టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండు సార్లు మాత్రమే బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి ముందంజలో నిలిచారు. కాంగ్రెస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. మధ్యలో ఎన్నికల ఫలితాల విడుదలలో జాప్యం జరగడంతో ఈసీపై రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే అభ్యర్ధులు ఎక్కువగా వుండటం వల్లే ఫలితం లేట్ అయ్యిందని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.

టీఆర్ఎస్ అధికారిక దుర్వినియోగానికి పాల్పడింది : రాజగోపాల్ రెడ్డి

కౌంటింగ్ అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. తనను కనీసం ప్రచారం చేసుకోనివ్వలేదని... టీఆర్ఎస్ పార్టీ నిబంధనలు ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. అటు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి మాట్లాడుతూ.. ఇతి తాత్కాలిక ఓటమేనని, కాంగ్రెస్‌కు మళ్లీ ప్రజలు పట్టం కడతారని ఆమె అన్నారు.